● భర్త, మరిది అరెస్టు
జయపురం: పెళ్లి అయిన రెండున్నర నెలలకే నవ వధువు అనుమానాస్పదంగా మరణించిన సంఘటనలో భర్త, మరిదిని బొయిపరిగుడ పోలీసులు అరెస్టు చేశారు. వరకట్న, లైంగిక వేధింపుల ఆరోపణలపై మృతురాలి భర్త మనోహర గొలారి(32), మరిది (భర్త తమ్ముడు) తారా ప్రసాద్ గొలారి (29)ని అరెస్టు చేసి కోర్టుకు తరలించామని జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ పోలీసులు మంగళవారం వెల్లడించారు. కమతా గ్రామ వాసి కృష్ణ చంద్ర పూజారి సోదరి కిశోరీ పూజారికి 2026 జూన్ 26న బొయిపరిగుడ సమితి బలిగుడ గ్రామానికి చెందిన మనోహర గొలారితో వివాహమైంది. కొద్ది రోజులకే ఆమె మరిది తారాప్రసాద్ గొలారి కిశోరీ పూజారిపై ఓ యాప్ ద్వారా ఆమె కాల్ రికార్డ్‌తోపాటు ఆమె లైఫ్ వీడియో సేకరించాడు. అప్పటినుంచి కిశోరీ పూజారిని బ్లాక్‌మైయిల్ చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఆ విషయం భర్తతో చెప్పినా పట్టించుకొనేవాడు కాదని కిశోరీ సోదరుడు కృష్ణచంద్ర పూజారి ఆరోపించారు. వరకట్నం కోసం భర్త, మరిది ఎక్కువగా వేధించేవారని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేశారు. భర్త, మరిది పెట్టిన వేధింపులు తట్టుకోలేక కిశోరీ.. రాఖీ పండగకు పుట్టింటికి వెళ్లి కన్నవారితో మొర పెట్టుకుంది. ఈ నెల 4వ తేదీన ఆమె తిరిగి అత్తవారింటికి వచ్చింది. ఈ నెల 8వ తేదీన కిశోరీ మృతి చెందిందని కబురు రావటంతో ఆమె సోదరుడు కృష్ణచంద్ర బలిగుడ గ్రామానికి వెళ్లి సోదరి మృతదేహాన్ని చూసి అనుమానించాడు. తన సోదరిని చంపి ఆమె భర్త, మరిది మరణించిందని చెబుతున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించాడు. కృష్ణచంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త, మరిదిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.


