● ఏకలవ్య పాఠశల భవనం అప్పగింతలో జాప్యం
● 60 మంది విద్యార్థులు చదువుకు దూరం..!
రాయగడ: నిర్మాణం పూర్తయినా ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాల భవనం అప్పగింత జరగకపోవడంతో 60 మంది గిరిజన విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు. రామనగడులో నిర్మించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూల్‌లో ఈ విద్యా సంవత్సరం ఆరో తరగతిలో 30 మంది బాలురు, 30 మంది బాలికలను చేర్చేందుకు ఎంపిక ప్రక్రియ పూర్తయినప్పటికీ.. ఇప్పటివరకు తరగతులు ప్రారంభించలేదు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రామనగుడలో నిర్మించిన ఈ పాఠశాల సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. సీబీఎస్‌ఈ విధానంలో విద్యాబోధనతో పాటు విద్యార్థులకు వివిధ క్రీడలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నారు. విద్యార్థుల వసతి గృహాలు, సిబ్బంది క్వార్టర్లు తదితర నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. కొన్ని నెలల క్రితం జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి పాఠశాలను సందర్శించిన సమయంలో కొన్ని మౌలిక వసతుల పనులు అసంపూర్తిగా ఉండటాన్ని గుర్తించి, వాటిని పూర్తి చేసి భవనాన్ని అప్పగించాలని ఆదేశించారు. అయితే కలెక్టర్ ఆదేశాలు జారీ చేసి నాలుగు నెలలు గడిచినా భవనం అప్పగింత జరగలేదని సమాచారం.
భవణం అందుబాటులోకి రాకపోవడంతో రామనగుడ ఏకలవ్య పాఠశాలలో ఎంపికై న 60 మంది విద్యార్థులను ప్రస్తుతం రాయగడ ఏకలవ్య పాఠశాలతో అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ విద్యా సంవత్సరం ప్రారంభమై చాలాకాలం గడిచినా ఈ విద్యార్థులకు తరగతులు ప్రారంభం కాకపోవడంతో వారు చదువుకు దూరమవుతున్నారు. ఈ విషయంపై రామనగుడ సంక్షేమ శాఖ విభాగం అధికారి నిరంజన్ పట్నాయక్‌ను ప్రశ్నించగా.., తాను ఇటీవలే బాధ్యతలు చేపట్టానని, పాఠశాల ఎందుకు ప్రారంభం కాలేదో తనకు తెలియదని తెలిపారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆసీమా రావ్ మాట్లాడుతూ.. పాఠశాల నిర్మించిన సంస్థ ఇప్పటివరకు భవనాన్ని అధికారికంగా అప్పగించలేదన్నారు. విద్యార్థుల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాటు పూర్తయ్యాయని, రాయగడ ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో రామనగుడ ఏకలవ్య పాఠశాలను పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామని వెల్లడించారు. మరోవైపు నిర్మాణ సంస్థకు బిల్లుల చెల్లింపులు జరగకపోవడంతోనే భవనం అప్పగించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనప్పటికీ భవనాన్ని త్వరగా ప్రారంభించి తమ పిల్లల చదువుకొనసాగేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


