ఎంపీ నిధుల ప్రాజెక్టులకు మోక్షమెప్పుడో? | - | Sakshi
Sakshi News home page

ఎంపీ నిధుల ప్రాజెక్టులకు మోక్షమెప్పుడో?

Sep 17 2026 12:50 AM | Updated on Sep 17 2026 12:50 AM

ఈ–సాక్షిలో అప్‌డేట్‌ కాని పనుల వివరాలు

అనుమతుల కోసం ఎదురుచూపు

రాయగడ: ప్రజాభివృద్ధి కోసం ఎంపీ నిధుల నుంచి నిధులు మంజూరవుతున్నా..వాటితో చేపట్టిన పలు ప్రాజెక్టుల అమలు, ఆన్‌లైన్‌ వివరాల నవీకరణలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల పనులు పూర్తయి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించినప్పటికీ ఈ–సాక్షి పోర్టల్లో వివరాలు అప్‌డేట్‌ కాలేదు. మరికొన్ని ప్రాజెక్టులు పరిపాలనా అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి. చివరి దశ జియో ట్యాగింగ్‌ జరగకపోవడం, ఐడీ –పాస్‌వర్డ్‌ అందకపొవడం, కొన్ని చోట్ల భూమి అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో ప్రాజెక్టుల పురోగతి ఆన్‌లైన్‌లో ప్రతిబింబించడం లేదు. దీంతో ఎంపీ నిధుల ప్రాజెక్టుల అమలులో శాఖల మధ్య సమన్వయం, పరిపాలనా చురుకుదనంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇదీ పరిస్థితి..

2024–25 నుంచి 2026–27 ఆర్థిక సంవత్సరాల వరకు రాయగడ జిల్లాలో 18 లోక్‌సభ ఎంపీ ప్రాంతీయ అభివృద్ధి నిధుల కింద పలు అభివృద్ధి పనులకు ఆమోదం లభించింది. అందుబాటులో ఉన్న వివరాలను పరిశీలిస్తే ప్రాజెక్టుల మంజూరు నుంచి పనుల పూర్తి, నిధుల చెల్లింపు, ఈ–సాక్షి పోర్టల్‌లో వివరాల ఆప్‌డేట్‌ వరకు వివిధ దశల్లో జాప్యం కనిపిస్తోంది.

బిసంకటక్‌లో..

2024–25లో రెండు ప్రాజెక్టులకు 10 లక్షల రూపాయలు మంజూరైనా ఈ–సాక్షి పోర్టల్‌లో అవి ఇంకా అనుమతి దశలోనే ఉన్నాయి. ఇందులో ఒక ప్రాజెక్టు క్షేత్రస్థాయిలో పూర్తికాగా, మరో ప్రాజెక్టు అసంపూర్తిగా ఉంది. మునిగుడలో రెండు ప్రాజెక్టులకు ఆరు లక్షల రూపాయలు, గుడారిలో ఓ ప్రాజెక్టుకు ఐదు లక్షల రుపాయలు మంజూరైనా పోర్టల్‌లో అనుమతి దశలోనే ఉన్నట్లు నమోదైనట్లు చూపిస్తోంది.

కాసీపూర్‌, చంద్రపూర్‌లో..

కాసీపూర్‌ సమితిలో రెండు ప్రాజెక్టులు పూర్తయి 6 లక్షల రూపాయలు చెల్లించినప్పటికీ ఈ–సాక్షిలో వివరాలు అప్‌డేట్‌ కాలేదు. ఐదు రోజుల్లొ ఆప్‌డేట్‌ చేస్తామని అధికారులు పేర్కొంటున్నట్లు సమాచారం. చంద్రపూర్‌లో నాలుగు ప్రాజెక్టులు పూర్తయి 9 లక్షల రూపాయలు చెల్లించినా సంబంధిత అసిస్టెంట్‌ ఇంజనీర్‌, జూనియర్‌ ఇంజినీర్ల మొబైల్‌ యాప్‌ ద్వారా చివరి దశ జియో ట్యాగింగ్‌ పూర్తి కాకపోవడంతో పోర్టల్లో వివరాలు కనిపించడం లేదు.

రాయగడ సమితిలో..

రాయగడ సమితిలో 76.5 లక్షలతో 24 ప్రాజెక్టులు మంజూరయ్యాయి. వీటిలో 23 పనులు పూర్తయి ఈ–సాక్షిలో నమోదయ్యాయి. మిగిలిన ఒక ప్రాజెక్టుకు 5 లక్షల రూపాయలు చెల్లించగా, మరో 45 రోజుల్లో పూర్తి చేయాలని గడువు విధించారు.

2025–26లోనూ పెండింగ్‌ జాబితా..

కాసీపూర్‌లో 18 లక్షల విలువైన నాలుగు ప్రాజెక్టులు ఆగస్టు 2026లో మంజూరైనా ఈ–సాక్షిలో అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి. మునిగుడలో రూ.90 లక్షలతో 40 ప్రాజెక్టులు ప్రతిపాదించగా 34 మంజూరయ్యాయి. ఇందులో 30 ప్రాజెక్టులకు సంబంధించిన 65.5 లక్షల రూపాయలు పోర్టల్లో అనుమతి కోసం పెండింగ్‌లో ఉన్నాయి. పద్మపూర్‌లో రూ.65 లక్షలతో 25 ప్రాజెక్టులు మంజూరయ్యాయి. మొత్తం 25 ప్రాజెక్టులు ఈ–సాక్షి అనుమతి కోసం ఎదురుచూస్తుండగా, 24 పనులను అక్టోబర్‌ 10 లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాయగడ సమితిలో 53.2 లక్షల రుపాయలతో 11 ప్రాజెక్టులు మంజూరయ్యాయి. నాలుగు పనులు క్షేత్రస్థాయిలొ పూర్తయినా , కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే ఈ–సాక్షిలో అప్‌డేట్‌ అయ్యింది. రెండు ప్రాజెక్టులకు 12.7 లక్షల రూపాయలు చెల్లించగా , మరో తొమ్మిది ప్రాజెక్టులకు సంబంధించిన 40.5 లక్షల రుపాయలు ఈ–సాక్షి అనుమతి కోసం పెండింగ్‌లో ఉన్నాయి.

● ప్రజల అభివృద్ధి కోసం మంజూరయ్యే ఎంపీ నిధులు లక్ష్యానికి అనుగుణంగా వినియోగించాలంటే..ప్రాజెక్టు మంజూరు, భూమి గుర్తింపు, వర్క్‌ ఆర్డర్‌, పనుల పూర్తి, నిధుల చెల్లింపు, జియో ట్యాగింగ్‌, ఈ–సాక్షిలో వివరాల అప్‌డేట్‌ వంటి ప్రతి దశలోనూ సమయపాలన అవసరం. అయితే కొన్ని చొట్ల జియోట్యాగింగ్‌ మరికొన్ని చొట్ల ఐడీ –పాస్‌వర్డ్‌, ఇంకొన్ని కోట్ల భూమి సమస్యలు అడ్డంకిగా మారుతున్న నేపథ్యంలో సంబంధిత శాఖల మధ్య సమన్వయం ఎంతవరకు ఉందన్నది చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement