హిరమండలం: వరి తెగుళ్ల బారిన పడకుండా సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ జేడీ వై.వి.మురళీకృష్ణ అన్నారు. ఎల్‌ఎన్‌పేట మండలం రావిచెంద్రిలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. వరి పొలాలను పరిశీలించి యాజమాన్య పద్ధతులపై రైతులకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 1.59 లక్షల హెక్టారుల్లో వరి సాగు అవుతున్నట్టు వివరించారు. పత్తి, వేరుశనగ, మొక్కజొన్న వంటి పంటల సాగు కూడా జరుగుతోందని చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వరి సాగులో మెలకువలు పాటించాలన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉదయ్‌బాబు, ఏడీ రాజగోపాల్, ఏవో కిరణ్‌వాణి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో ట్రెజరీ అధికారి ఏఏవో ఎం.భాగ్యలక్ష్మి అత్యద్భుతమైన ప్రదర్శన కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. తణుకు వేదికగా ఈనెల 12, 13 తేదీల్లో జరిగిన ఏపీ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో 50 ప్లస్ వయో విభాగంలో మూడు పతకాలు సాధించి సత్తాచాటారు. జావెలిన్ త్రోలో బంగారు పతకం, లాంగ్‌జంప్‌లో రజత పతకం, షాట్‌ఫుట్‌లో కాంస్య పతకం సాధించిన భాగ్యలక్ష్మి యువ అథ్లెట్స్‌కు ఆదర్శంగా నిలిచారు. దీంతో అక్టోబర్ 9 నుంచి 11 వరకు కోయంబత్తూరు వేదికగా జరిగే ఆలిండియా నేషనల్ లెవల్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్–2026 పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా ట్రెజరీ కార్యాలయంలో డీడీ సీహెచ్ రవికుమార్ రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించిన ఏఏవో భాగ్యలక్ష్మిని ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ పోటీల్లోను రాణించి జిల్లాకు, ట్రెజరీ శాఖకు పేరుతీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు ట్రెజరీ శాఖ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం
శ్రీకాకుళం కల్చరల్: ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామివారికి బుధవారం కప్ప జయవర్ధన్, నిహారిక దంపతులు వారి కుమార్తె జుహిత పేరున అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళమందించారు. వారిని వేదమంత్రాలతో ఆశీర్వచనం చేయించి చిత్రపటం, ప్రసాదాలు ఆలయ పాలక మండలి సభ్యులు అంధవరపు రఘురాం అందించారు.
ఆర్‌జేడీ ఆకస్మిక పర్యటన
శ్రీకాకుళం అర్బన్: సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ పద్మలత బుధవారం శ్రీకాకుళంలోని ఐసీడీఎస్ కార్యాలయం, అరసవల్లిలోని శిశుగృహ, చిల్డ్రన్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారుల ఆలన, పాలన, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హరిఓం పాండే, ఐసీడీఎస్ పీడీ పి.శోభారాణి, నోడల్ అధికారి మణెమ్మ, డీఎఫ్‌సీ కో–ఆర్డినేటర్ ఉమ, డీసీపీవో రమణ, సీనియర్ అసిస్టెంట్ కె.రామారావు, డీపీఏ ఎం.మహేశ్వరరావు, శిశుగృహ మేనేజర్ నరేష్, అధికారులు, సిబ్బంది ఉన్నారు.
పీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ తనిఖీలు
గార: గార ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నరేష్‌కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. పీహెచ్‌సీలో అందుతున్న సేవలు, వ్యాక్సినేషన్లు పరిస్థితిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పీహెచ్‌సీ పరిధిలోని బోరవానిపేట పంచాయతీని చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్‌గా జాతీయ స్థాయి పోటీకి నామినేట్ చేయడంతో సచివాలయాన్ని సందర్శించారు. పంచాయతీలోని ఆరోగ్య పరిస్థితులు, తాగునీటి సరఫరాకు సంబంధించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ సోనియా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


