భువనేశ్వర్: ఈ ఏడాది రుతుపవన కాలంలో రాష్ట్రంలో ఇప్పటివరకు 11 అల్పపీడనాలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది జూన్ 1 నుంచి నేటివరకు 11 అల్పపీడన ప్రాంతాలు ఏర్పడ్డాయని ఐఎండీ వివరించింది. ఐఎమ్‌డీ సమాచారం ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు 1,269.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది దీర్ఘకాల సగటు కంటే 21 శాతం అధికం కావడం విశేషం. సమగ్ర వర్షపాతం అధికంగా ఉన్నప్పటికీ గజపతి, నవరంగ్‌పూర్ రెండు జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. నైరుతి రుతు పవనాల ఉపసంహరణకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తిరోగమనం ఈ ఏడాది సెప్టెంబర్ 19వ తేదీ నాటికి పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి ప్రారంభమై క్రమంగా వాయువ్య భారత దేశం అంతటా విస్తరిస్తుందని అంచనా. ప్రస్తుత అనుకూల పరిస్థితులు ఇలాగే కొనసాగితే అక్టోబర్ రెండవ వారం నాటికి ఒడిశా నుంచి రుతు పవనాలు పూర్తిగా ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం, వాయువ్య బంగాళా ఖాతం మరియు పొరుగు ప్రాంతాలపై ఒక తుఫాను వలయం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు అక్టోబర్ మరియు డిసెంబర్ మధ్య బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో మూడు తుఫాన్‌లు ఏర్పడే అవకాశం ఉందని దుమారం రేపుతున్న సోషల్ మీడియా నివేదికలను స్థానిక ఐఎమ్‌డీ కేంద్రం తోసిపుచ్చింది. అటువంటి అంచనా ఏదీ జారీ చేయలేదని ఐఎమ్‌డీ స్పష్టం చేసింది. వాతావరణ నమూనాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఏదైనా ముఖ్యమైన వాతావరణ వ్యవస్థ ఏర్పడితే సకాలంలో తాజా సమాచారం జారీ చేయడం జరుగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది.


