సృష్టి శిల్పికి.. భక్తి నీరాజనం..! | - | Sakshi
Sakshi News home page

సృష్టి శిల్పికి.. భక్తి నీరాజనం..!

Sep 17 2026 12:50 AM | Updated on Sep 17 2026 12:50 AM

● నేటి నుంచి విశ్వకర్మ జయంతి ఉత్సవాలు

● ఐదు రోజుల పాటు జరగనున్న వేడుకలు

● ఏర్పాట్లు పూర్తి చేసిన కమిటీ సభ్యులు

శ్రీకాకుళం కల్చరల్‌: సకల కళలకు ఆది దేవుడు, దేవలోకాలను నిర్మించిన వాస్తు శిల్పిగా పేరుగాంచిన విశ్వకర్మ జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీకాకుళం నగరంలో ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు ఐదురోజుల పాటు అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు ఆయా కమిటీల ప్రతినిధులు సర్వం సిద్ధం చేశారు. విశ్వకర్మను బ్రహ్మదేవుని కుమారునిగా పురాణాలు చెబుతున్నాయి. దేవ లోకాలను నిర్మించిన స్తపతి. దేవతలకు ఆకాశమార్గాన విహరించే పుష్పక విమానం, ఆభరణాలను, ఆయుధాలను తయారు చేసిన శిల్పి. కృష్ణు ని కోసం ద్వారకా నగరాన్ని, పాండవుల కోసం ఇంద్రప్రస్థ రాజ భవనాన్ని, విష్ణువు సుదర్శన చక్రం, శివుని త్రిశూలం, కార్తికేయుని బల్లెం వంటి అనేక అద్భుతమైన ఆయుధాలను దేవతల కోసం నిర్మించిన ఘనత ఆయనకు దక్కింది. యాంత్రిక శాస్త్రం, వాస్తు శాస్త్రమైన స్థపత్య వేదాన్ని కూడా ఆయనే రచించారని భావిస్తారు. ఆయనను సమస్త చేతివృత్తుల వారికి ఆరాధ్యదైవంగా పరిగణిస్తారు. విశ్వకర్మ పూజ సందర్భంగా ఆయన గౌరవార్థం తరచుగా వృత్తి పనిముట్లను పూజిస్తారు. కళాకారులు, చేతివృత్తి నిపుణు లు, మెకానిక్‌లు, కమ్మరివారు, వెల్డర్లు, పారిశ్రామిక కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులు, ఇంజినీర్లు, ఆర్కిటెక్టులు, ఇతర కార్మికులు ఈ పండగను జరుపుకుంటారు.

రాష్ట్ర పండుగగా..

విశ్వకర్మ జయంతిని రాష్ట్ర పండుగగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గుర్తించింది. అప్పటినుంచి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. విశ్వకర్మ నిర్మాణ శిల్పి కావడం వల్ల పట్టణంలోని స్వర్ణకార సంఘం, విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఆయా కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నారు. చంపాగల్లివీధిలోని శ్రీకంచి కామాక్షి దేవి శ్రీకాకుళం పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఐదురోజులపాటు వేడుకలు జరగనున్నాయి. శ్రీకాకుళం మండలం చాపురం పంచాయతీలోని గోవిందపురం గ్రామంలో చలపాక సూర్యారావు తన తండ్రి జ్ఞాపకార్థం విశ్వకర్మ గార్డెన్‌ నిర్మించారు. ఉద్యోగ విరమణ పిదప తండ్రి నారాయణాచారి కోరక మేరకు ఈ గార్డెన్‌లో ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 17న విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహిస్తారు.

పట్టణ స్వర్ణకార సంఘం సభ్యులు

ప్రతి ఏడాది ఘనంగా చేస్తాం

ప్రతీ ఏడాది విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహిస్తాం. గత ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించడంతో మరింత విశిష్టత చేకూరింది.

– సోపింటి తారకేశ్వరరావు, అధ్యక్షుడు, పట్టణ స్వర్ణకార సంఘం, శ్రీకాకుళం

దేవవాస్తు శిల్పి విశ్వకర్మ

దేవ వాస్తుశిల్పిగా పేరు గాంచిన విశ్వకర్మ మాలాంటి వారికి ఆరాధ్య దైవం. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పండుగ చేస్తారు. పనిముట్లను నమ్ముకున్న మాకు స్వామివారి పూజ ఎంతో విశిష్టమైనది. – కడారి దుర్గాప్రసాద్‌,

కార్యదర్శి, పట్టణ స్వర్ణకార సంఘం, శ్రీకాకుళం

కార్యక్రమాలు ఇలా..

17న విశ్వకర్మ మృణ్మయ విగ్రహం గ్రామ ప్రదక్షిణ, పూజలు.

18న విరాట్‌ విశ్వకర్మ సహస్రనామ పత్రిపూజ.

19న గాయత్రి దేవి, లలితాదేవి సహస్రనామ కుంకుమార్చనలు, లక్ష దీపారాధనలు.

20న స్వామివారికి సహస్రనామ పత్రపూజ, తీర్థప్రసాద వితరణ.

21న విశ్వకర్మ పంచసూక్త హోమం, పూర్ణాహుతి, అన్నప్రసాద వితరణ జరుగుతాయి.

23న సాయంత్రం నిమజ్జనోత్సవం

నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement