ఆదిత్యుని సన్నిధిలో గంజాం జిల్లా ఐఏఎస్‌ అధికారి | - | Sakshi
Sakshi News home page

ఆదిత్యుని సన్నిధిలో గంజాం జిల్లా ఐఏఎస్‌ అధికారి

Sep 16 2026 3:19 AM | Updated on Sep 16 2026 3:19 AM

13 కుక్కకాటు కేసులు నమోదు

అరసవల్లి: ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా ఐఏఎస్‌ అధికారి కీర్తివాసన్‌ కుటుంబ సమేతంగా మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆలయ సూపరింటెండెంట్‌ కె.వెంకటేశ్వరరావు, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అనంతరం ఆలయ విశిష్టతను వివరించి వేదాశీర్వచనాన్ని అందించారు. కార్యక్రమంలో అర్చకులు ఇప్పిలి సాందీప్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

కళా ప్రియులకు నాటకాల విందు

17 నుంచి బహుభాషా నాటక పోటీలు

శ్రీకాకుళం కల్చరల్‌: సుమిత్రా కళా సమితి ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు బహుభాషా నాటిక పోటీలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళా మందిరంలో నాలుగు రోజుల పాటు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి నాటిక ప్రదర్శనలు చేపట్టనున్నారు. కలకత్తా, గౌహతి, ముంబై, బెంగళూరు, రూర్కెలా, రాయ్‌పూర్‌, గుడివాడ, ప్రయాగ్‌రాజ్‌ ప్రాంతాల నుంచి కళాకారులు వచ్చి నాటికలను ప్రదర్శిస్తారు. 2017లో కూడా బహుభాషా నాటిక పోటీలు నిర్వహించారు. తొలిరోజు 17న బెంగాళీ కళాకారులు జ్వాలా, అస్సామీ బృందం జీవశ్రేష్ఠ్‌, 18న మరాఠీ నాటిక సూప్‌, కన్నడ నాటిక సాంగ్యాచీబాల్యా, 19న ఒడియా నాటిక ఫేసెస్‌ ఆఫ్‌ ఉమెన్‌, ఛత్తీస్‌ఘడ్‌ నాటిక యకీనన్‌ ప్రదర్శించనున్నారు. 20న స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ నాటిక హిందీ, పంజాబీ భాషలో ప్రదర్శిస్తారు. తెలుగు నాటిక ద్వారబంధాల చంద్రయ్యనాయుడు ప్రదర్శిస్తారు.

పాముకాటుతో రైతు మృతి

రణస్థలం: మండలంలోని నారువ పంచాయతీ బోయపాలెం గ్రామానికి చెందిన రైతు నిద్రబంగి రమణ (39) పాముకాటుతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. సోమవారం ఉదయం తన పొలంలోని అరటి తోటలో నీరు కడుతుండగా పాముకాటుకు గురైయ్యాడు. వెంటనే పక్క తోటలోని రైతులు తెలియజేసి సమాచారం అందించారు. వాళ్లు ఆటోను పిలిచే లోపు స్పృహ కోల్పోయాడు. హుటాహుటిన కొండములగాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రమణ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రిమ్స్‌లో మంగళవారం శవపంచనామా చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. కుటుంబ పెద్ద దిక్కు కోల్పోవడంతో భార్య మహాలక్ష్మి, ఇద్దరు పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్‌పురం ఎస్‌ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్రాక్టర్‌ బోల్తా.. ఇద్దరికి గాయాలు

టెక్కలి రూరల్‌: మండలంలోని కె.కొత్తూరు సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై సోమవారం ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తాపడి ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసన్నపేట మండలం జడూరు గ్రామం నుంచి ఇటుకల లోడుతో టెక్కలి వైపు వస్తున్న క్రమంలో కె.కొత్తూరు వద్ద ట్రాక్టర్‌ వెనుక తొట్టే ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆ ఇటుకలపై కుర్చొని ఉన్న జి.కృష్ణారావు, బి.ఒన్నారిలపై ఇటుకలు పడిపోవడంతో తీవ్రగాయాలపాలయ్యారు. గాయపడినవారిని హుటాహూటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఇటుకలు మొత్తం రహదారిపై పడిపోవడంతో విషయం తెలుసుకున్న హైవే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ సరిచేశారు.

టెక్కలి రూరల్‌: స్థానిక జిల్లా ఆస్పత్రిలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా 13 కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. స్థానిక చిన్నబజారు, కొడ్రవీధి, కండ్రవీధి తదిత ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వీధికుక్కలు పలువురిపై దాడి చేసి గాయపరిచాయి. వీరిలో టి.భూలక్ష్మి, బి.జ్యోతి, బి.లిఖిత, బి.ఉమాశంకర్‌, కె.మధు, పి.ఆశిరమ్మ, ఎస్‌.రవి, ఎన్‌.మల్లేశ్వరరావు, డి.మణికంఠ, డి.చిన్నారావు, ఎల్‌.పృథ్వీరాజ్‌, పి.మల్లేష్‌, బి.రమేష్‌ లపై దాడి చేసి గాయపచడంతో వారు జిల్లా ఆస్పత్రిలో చేరారు. వీధుల్లో తిరుగుతున్న సమయంలోనే కుక్కలు వారిపై దాడిచేసినట్లు తెలిపారు. అలానే జూన్‌ నెలలో సైతం పిచ్చికుక్క స్వైరవిహారం చేసి 20 మందిని గాయపరిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement