● ముఖ్యమంత్రికి నివేదిక
సమర్పించిన కమిటీ
భువనేశ్వర్: పాఠశాల పాఠ్యపుస్తకాలలోని లోపాలను పరిశీలించడానికి ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీకి తన నివేదికను సమర్పించింది. ముఖ్యమంత్రి నిర్దేశించిన ఏడు రోజుల గడువులోగా అభివృద్ధి కమిషనర్ నేతృత్వంలోని ఈ కమిటీ నివేదికను ఆయనకు అందజేసింది. తదుపరి చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదికలోని అంశాలను సమీక్షించే అవకాశం ఉంది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠశాల పాఠ్య పుస్తకాల్లో అనేక తప్పులు కనుగొనడంతో, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ లోపాలకు బాధ్యులైన అధికారులు, ఏజెన్సీలను గుర్తించి, ఏడు రోజుల్లోగా తమ నివేదికను సమర్పించాలని అభివృద్ధి కమిషనర్ ఆధ్వర్యంలోని ఈ కమిటీని ముఖ్యమంత్రి ఆదేశించారు. పాఠ్యపుస్తకాల తయారీ, సమీక్ష, ప్రచురణ సమయంలో జరిగిన పొరపాట్లకు బాధ్యులైన అధికారులు, సంస్థలను గుర్తించడం, అలాగే ఆ తప్పులు ఎలా జరిగాయో పరిశీలించడం ఈ కమిటీకి అప్పగించిన బాధ్యత నేపథ్యంలో కమిటీ నివేదికని ముఖ్యమంత్రికి దాఖలు చేసింది. తదుపరి పరిశీలన కోసం ఈ నివేదికను ముఖ్యమంత్రికి పరిశీలిస్తున్నారు.
దోష పూరిత పాఠ్యపుస్తకాల ఉపసంహరణకు
ప్రభుత్వ ఉత్తర్వులు
1 నుంచి 8 తరగతుల పాఠ్య పుస్తకాల్లో బయటపడిన తప్పుల వెనుక కుట్ర ఉంది. ముద్రణ దోషాలున్న పుస్తకాలు అన్నింటినీ వెనక్కి పంపించేస్తాం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ మీడియాకు తెలియజేశారు. ప్రభుత్వం ఈ పొరపాటును తీవ్రంగా పరిగణించింది. గతంలోనూ తప్పులు జరిగాయి. కానీ ఈ సారి వాటి సంఖ్య అసాధారణంగా ఎక్కువగా ఉంది. పాఠ్యాంశాల రూపకల్పన, పరిశీలన నుంచి ముద్రణ వరకు సమగ్ర ప్రక్రియను తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతోందన్న అనుమానం ఉంది. పాఠ్య పుస్తకాల్లో తప్పులపై విచారణ జరిపేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదికని పరిశీలించి ప్రమేయం ఉన్నట్లు తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి హెచ్చరించారు. దోషులను గుర్తించి ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటాం. విద్యార్థులకు పంపిణీ చేసిన తప్పులతడక పాఠ్యపుస్తకాలన్నింటినీ వెనక్కి తీసుకుంటాం. కొత్త ప్రతులను ముద్రించి తిరిగి పంపిణీ చేస్తాం. కుట్రకు పాల్పడినట్లు ఆధారాలు లభిస్తే దోషుల నుంచి ముద్రణ ఖర్చులను వసూలు చేస్తాం అని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పుడు నివేదిక చేతికి అందినందున, పాఠ్యపుస్తకంలోని తప్పులకు బాధ్యులైన అధికారులు, సంస్థలపై చర్యలు ప్రారంభించే ముందు ప్రభుత్వం దానిలోని అంశాలను పరిశీలిస్తున్నారు.


