భువనేశ్వర్: శాసన సభ స్పీకర్ ఆమోదం మేరకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల సభా సంఘాలు ఏర్పాటు చేసింది. 10 స్థాయీ కమిటీలతో సహా 35కు పైగా కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష నాయకురాలు ప్రమీలా మల్లిక్‌కు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ)కి అధ్యక్షత వహించే బాధ్యతను అప్పగించారు. ఇతర కమిటీలలో పలువురు ఎమ్మెల్యేలకు స్థానాలు కల్పించారు. ప్రమీలా మల్లిక్ అధ్యక్షతన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ)లో రామచంద్ర కదమ్, అరుణ్ కుమార్ సాహు, గణేశ్వర్ బెహరా, సనాతన్ బిసి వంటి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
జయ నారాయణ్ మిశ్రా అధ్యక్షతన ఏర్పా టైన ప్రివిలేజెస్ కమిటీలో శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్, న్యాయ శాఖ మంత్రి పృథ్వీ రాజ్ హరిచందన్, ప్రభుత్వ చీఫ్ విప్ సరోజ్ ప్రధాన్ సభ్యులుగా ఉన్నారు. స్పీకర్ 10 స్థాయీ కమిటీలను ప్రకటించారు. 2026–27 సంవత్సరానికి ఆయా స్థాయీ కమిటీలకు శివ్ మహా పాత్రో, సంతోష్ ఖటువా, బాబూ సింగ్, బిభూతి ప్రధాన్, రామచంద్ర కదమ్, సనాతన్ మోక్ష, ఎమ్మెల్యే రణేంద్ర ప్రతాప్ స్వంయి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఆకాష్ దాస్ నాయక్ గ్రంథాలయ కమిటీ చైర్మన్‌గా నియమితులు అయ్యారు. ఈ కమిటీలో సస్పెండ్ అయిన 11 మంది ఎమ్మెల్యేలను సభ్యులుగా నియమించారు.
గుణుపూర్‌లో
భారీ అగ్ని ప్రమాదం
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సమితి డంబసర గ్రామ సమీపంలో ఉన్న ఒక కిరాణా దుకాణంలో శుక్రవారం తెల్లవారుజామున సంభవించిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ.40 లక్షలకు పైగా కిరాణా సరుకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీ మంటలతో దుకాణం పూర్తిగా అగ్నికి ఆహుతయ్యింది. డంబసర సమీపంలోని కె.గురునాథ్‌రావు అనే వ్యక్తికి చెందిన దుకాణంలో తెల్లవారుజామున మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్మకుకోవడంతో ఆ ప్రాంత ప్రజలు ఆయనకు సమాచారం అందించారు. అనంతరం పద్మపూర్, గుణుపూర్‌లకు చెందిన అగ్నిమాపక కేంద్రాల నుంచి మూడు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో మొదట దుకాణం షట్టరును తెరవలేకపోయారు. అనంతరం జేసీబీ సాయంతో షట్టరును పగులగొట్టి లోపలికి నీటిని చిమ్మి మంటలను పూర్తిగా అర్పేశారు. అగ్ని ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే ప్రాథమిక విచారణలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించాయని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు.


