రాయగడ: కల్యాణసింగుపూర్ గొడవకు సంబంధించి వాస్తవాలు తెలుసుకునేందుకు పీసీసీ అధ్యక్షుడు భక్తచరణ్ దాస్ ఆదేశానుసారం కొరాపుట్ లొక్‌సభ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక నేతృత్వంలో గురువారం నాడు ఒక బృందం సమితిలోని ఇంతాలిగుడ గ్రామంలో పర్యటించింది. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఎంపీ సప్తగిరి సమావేశమై అసలు విషయానికి సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తమ గ్రామంలో గల పురుషులను పోలీసులు అర్ధరాత్రి ఇళ్లకు వచ్చి అరెస్టు చేసి తీసుకుపోతున్నారని మహిళలు ఆరోపించారు. అసలు ఘటనకు సంబంధం లేని వారిని కూడా పోలీసులు అనుమానించి వారిని తీసుకు వెళ్లిపోవడం ఎంతవరకు సమంజసమని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లాపాపలతో ఏం చేయాలో తెలీని స్థితిలో ఉన్నామని గ్రామానికి చెందిన రజిని ఉలక అన్నారు. మరో రెండు రోజుల్లో తన భర్తను పోలీసులు విడిచిపెట్టకపోతే తాను తన పిల్లలతో కలసి పోలీస్ స్టేషన్ వద్ద విషం తాగి ఆత్మహత్యకు పాల్పడతానని అన్నారు. తమకు వేరే గత్యంతరం లేదని, ఇప్పటికై న పోలీసులు దయతలచి తన భర్తను విడిచిపెట్టాలని ఆమె కోరారు.
అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనలో అసలు పుకార్లు సృష్టించిన దండపొదొరొ గ్రామస్తులను విడిచి పోలీసులు ఇంతాలిగుడ గ్రామ ప్రజలను అరెస్టుల పేరిట వేధించడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. అయితే నిందితులను తప్పకుండా శిక్షించాలని, కానీ అమాయకులు కూడా పోలీసుల బారిన పడి ఇబ్బందులకు గురవ్వడం విచారకరమని అన్నారు. ఇదే విషయాన్ని తాను సమగ్ర నివేదికను పీసీసీ అధ్యక్షునికి సమర్పించి గ్రామస్తులకు తగిన న్యాయం చేస్తానని అన్నారు.
పుకార్లు విని మోసపోవద్దు..
అవిభక్త కొరాపుట్ జిల్లాలొ ఇదివరకు ఇలాంటి తరహా ఘటనలు ఎప్పుడూ చోటు చేసుకోలేదని, శాంతికి ప్రతీకగా నిలిచే రాయగడ జిల్లాలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ప్రభుత్వ అసమర్థతకు మచ్చుతునకగా మారిందన్నారు. ఈ నిజ నిర్ధారణ బృందంలో ఉలక తొపాటు బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక, డీసీసీ ఉపాధ్యక్షుడు శంకర్షన్ మంగరాజ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నంది గౌరి తదితరులు పాల్గొన్నారు.


