పూరీ రథయాత్రకు ప్రత్యేక బస్సులు | - | Sakshi
Sakshi News home page

పూరీ రథయాత్రకు ప్రత్యేక బస్సులు

Jun 26 2026 7:45 AM | Updated on Jun 26 2026 7:45 AM

రథ యాత్రలో టోల్‌ ఫీజు మినహాయింపు

భువనేశ్వర్‌: ప్రపంచ ప్రసిద్ధ పూరీ రథయాత్ర సందర్భంగా భక్తులకు సులభమైన రవాణా సేవలను అందించేందుకు రవాణా శాఖ ప్రత్యేక బస్సులు నడిపిస్తుందని ప్రకటించారు. యాత్రలో భాగంగా జరిగే శ్రీ గుండిచా యాత్ర, బహుడ యాత్ర రోజుల్లో పూరీ టోల్‌ వసూళ్లు నిలిపివేస్తారు. పిప్పిలి టోల్‌ ప్లాజా వద్ద బస్సులు, కార్లు, ఇతర ప్రైవేట్‌ లేదా వాణిజ్య వాహనాలతో సహా అన్ని రకాల వాహనాలకు టోల్‌ రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుందని రవాణా శాఖ కమిషనర్‌ తెలిపారు. స్థానిక ఆర్టీఓ–1 కార్యాలయంలో రాష్ట్ర రవాణా కమిషనర్‌ అమితాబ్‌ ఠాకూర్‌ అధ్యక్షతన జరిగిన సమన్వయ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ప్రస్తుతం ప్రతి రోజూ పూరీకి సుమారు 200 ప్రైవేట్‌ బస్సులు నడుస్తుండగా రథ యాత్ర సమయంలో ఇతర మార్గాల్లో తిరిగే మరో 200 బస్సులకు తాత్కాలిక అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ తాత్కాలిక అనుమతులను శ్రీ గుండిచా యాత్ర, బహుడ యాత్ర, స్వర్ణ అలంకార దర్శనం కోసం పరిమితం చేశారు. ఈ విధంగా సుమారు 400 ప్రైవేట్‌ బస్సులను నడపాలని ప్రణాళిక రూపొందించారు. దీనితో పాటు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఓఎస్‌ఆర్టీసీ) మరియు సీఆర్యూటీ బస్సు సర్వీసులను పెంచాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. బస్సులో ఏ ప్రయాణికుడైనా అస్వస్థతకు గురైతే తక్షణ సహాయం అందించేందుకు అన్ని బస్సులలో ప్రథమ చికిత్స కిట్లను ఉంచాలని నిర్ణయించారు. ప్రధాన బస్‌ టెర్మినళ్లు, బస్‌ స్టాపులు, బస్సుల్లో ప్రయాణికుల కోసం తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను ఏర్పాటు చేస్తారు. రథ యాత్ర సమయంలో పూరీ, తలొబొణియా, రాష్ట్ర రవాణా ప్రధాన కార్యాలయంలో రాత్రింబవళ్లు పని చేసే సమాచార కేంద్రం, కంట్రోల్‌ ఏర్పాటు చేస్తారు. దీని కోసం ఒక ప్రత్యేక నంబర్‌ను జారీ చేస్తారు. మరో టోల్‌–ఫ్రీ నంబర్‌ కూడా పనిచేస్తుంది.

ఇ–రిక్షా సౌకర్యం

ప్రయాణికుల సౌకర్యానికి తలొబొణియా ప్రాంతంలో త్రాగు నీరు, విద్యుత్‌ సౌకర్యాలతో కూడిన విశ్రాంతి గృహాన్ని నిర్మించనున్నారు. దీనితో పాటు ఉచితంగా వండిన ఆహారాన్ని అందిస్తారు. అదే విధంగా అవసరాన్ని బట్టి మాలతీపట్టుపూర్‌లో ఏర్పాట్లు చేస్తారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే బస్సులకు ఈ ప్రాంతంలో ఆగేలా ఏర్పాట్లు చేసి అక్కడి నుండి భక్తుల కోసం ఉచిత షటిల్‌ సర్వీసును అందిస్తారు. అదే విధంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో తలొబొణియా, ఇతర ప్రధాన పార్కింగ్‌ ప్రాంతాల నుంచి ఉచిత ఇ–రిక్షా సౌకర్యాలను కల్పిస్తారు. ఇందు కోసం 450 ఇ–రిక్షాలను నిర్వహిస్తారు.

చార్జీల వసూలుపై నిఘా

ప్రతి బస్సులో చార్జీల పట్టికలను ప్రదర్శించడం తప్పనిసరి చేశారు. రవాణా శాఖ, బస్సు యజమానుల సంఘంతో కలిసి పూరీలోని ఆటో రిక్షాల ఛార్జీలపై కూడా నిశితంగా పర్యవేక్షిస్తుంది. ప్రయాణికులు ఎలాంటి దోపిడీకి గురికాకుండా చూడటం ప్రధాన ప్రాధాన్యతగా ఉంటుంది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి భువనేశ్వర్‌–పూరీ రహదారిపై తగినన్ని క్రేన్లు, అంబులెన్సులు మోహరిస్తారు. ఇందుకోసం పోలీసు శాఖ, ఆరోగ్య శాఖల మధ్య నిరంతర సమన్వయం ఉంటుంది. రోడ్డు ప్రమాద బాధితులకు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులలో తక్షణ చికిత్స అందేలా చూస్తారు. అదేవిధంగా, భువనేశ్వర్‌ – పూరీ, పూరీ – కోణార్క్‌ జాతీయ రహదారులపై ఏదైనా వాహనం పాడైతే, తక్షణ మరమ్మతు సేవలను అందించాలని వాహన తయారీదారులు, డీలర్లను కోరారు. వాహన తయారీదారులు, డీలర్లు కొన్ని కీలక ప్రదేశాలలో సహాయక శిబిరాలను ఏర్పాటు చేస్తారు. సమావేశానికి జంట నగరాలు భువనేశ్వర్‌, కటక్‌ డీసీపీలు, ట్రాఫిక్‌ డీసీపీ, పూరీ జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్‌, రాష్ట్ర రవాణా అథారిటీ (ఎస్‌టీఏ) అధికారులు, బస్సు యజమానుల సంఘం కార్యకర్తలు, ఓఎస్‌ఆర్టీసీ, సీఆర్యూటీ ప్రతినిధులు హాజరయ్యారు. పూరీ జిల్లా మేజిస్ట్రేట్‌ వర్చువల్‌ విధానంలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement