జయపురం: జయపురం సమితి కార్యాలయంలో అధికారులు ముఖ్యమంత్రి జీవికా మిషన్ పథకంలో అంతర్భాగమైన ‘వికాశ ధారా ఒడిశా సారా’ కార్యక్రమం గురువారం నిర్వహించారు. దీనిలో భాగంగా 20 మంది అంగన్‌వాడీ కార్యకర్తలకు సెల్‌ఫోన్లు ఉచితంగా అందజేశారు. అలాగే ఏడుగురు కార్మికులకు శ్రామిక కార్డులు, 20 మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్ కార్డులు, మరో 20 మంది మహిళలకు ముఖ్యమంత్రి అన్నపూర్ణ యోజన కార్డులను ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జయపురం సమితి బీడీవో శక్తి మహాపాత్రో మాట్లాడుతూ.. రెండేళ్లలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను తెలియజేశారు. కార్యక్రమంలో జయపురం సమితి అధ్యక్షురాలు తిలోత్తమ ముదులి, జిల్లా పరిషత్ సభ్యుడు తిరుపతి పట్నాయిక్, జిల్లా మహిళా బీజేపీ అధ్యక్షురాలు స్వాతి హత్త, సీడీపీవో అంజన్ సండ, బిజయ కుమార్ నందో తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ
పర్లాకిమిడి: మహిళల స్వయం ఉపాధికి గజపతి జిల్లా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రంలో టైలరింగ్ శిక్షణలో భాగంగా 35 మంది మహిళలకు నెలరోజులపాటు శిక్షణ అందిస్తున్నారు. జిల్లాలోని మోహనా, ఆర్.ఉదయగిరి, రాయఘడ, నువాగడ, గుసాని, పర్లాకిమిడి నుంచి 35 మంది మహిళలు ఉచితంగా టైలరింగ్‌లో శిక్షణ పొందుతున్నట్లు డొమైన్ స్కిల్ ట్రైనర్ ఎ.బాలామణి అచారి తెలియజేశారు. వీరిని వసతి, భోజన సదుపాయాలు ఉచితంగా అందిస్తున్నారు. జూన్ 8 నుంచి జూలై 8 వరకు ఆర్.శెట్టి భవనంలో మహిళలు టైలరింగ్‌లో శిక్షణ పొందిన అనంతరం వారికి సర్టిఫికెట్లు అందజేసి, తగిన ఆర్థిక సహకారం యూనియన్ బ్యాంకు ద్వారా అందిస్తున్నట్లు యూనియన్ బ్యాంకు ఆర్‌శెట్టి డైరక్టర్ తెలియజేశారు.
బాలాసోర్‌లో పట్టపగలు వ్యాపారవేత్త కాల్చివేత
భువనేశ్వర్: బాలాసోర్‌లో గురువారం మధ్యాహ్నం పట్టపగలు నడి రోడ్డు మీద దారుణ హత్య చోటు చేసుకుంది. ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది. ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఒక వ్యాపారవేత్తకు తుపాకీ గురి పెట్టి కాల్చి చంపారు. ఈ హత్యపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. అరడ్ బజార్‌లోని 2వ నంబరు వీధిలో ఈ ఘటన జరిగింది. మృతుడిని కార్ యాక్సెసరీస్ వ్యాపారమైన ఫ్రీడమ్ ఫ్యాషన్ యజమాని ఎస్. కె. హమీద్‌గా గుర్తించారు. ఎస్. కె. హమీద్ తల, ముఖం, శరీరంలోని ఇతర భాగాలపై తీవ్రమైన బుల్లెట్ గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై వచ్చి హమీద్ తన కారు దిగుతుండగా గురి పెట్టి అతనిపై కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. స్థానికులు హమీద్‌ను బాలాసోర్ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యులు అతను మరణించినట్లు ప్రకటించారు. సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పరిశీలనలో సీసీటీవీ ఫుటేజ్
కాల్పులకు ముందు నల్ల ముసుగు తొడిగిన ఇద్దరు వ్యక్తులు బాధితుడిని వెంబడిస్తున్నట్లు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపిస్తోందని దర్యాప్తు అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.30 గంటల మధ్య ఈ కాల్పుల ఘటన జరిగిందని బాలాసోర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ప్రత్యూష్ దివాకర్ తెలిపారు. ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై వచ్చి బాధితుడిపై కాల్పులు జరిపారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం 2 వేర్వేరు తుపాకులను ఉపయోగించి ఉండవచ్చని తెలుస్తోందని ఎస్పీ అన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన శాసీ్త్రయ బృందం సుమారు 8 ఖాళీ తూటాల కేసింగ్‌లను స్వాధీనం చేసుకుందని ఎస్పీ తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం, పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బందితో పాటు ఒక ప్రత్యేక బృందంతో 4 బందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. మొహర్రం వేడుకల దృష్ట్యా పోలీసులు బాలాసోర్ పట్టణంలో గస్తీని పెంచడంతో పాటు భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేశారు. ప్రజలు భయాందోళనలకు గురికావద్దని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. కాల్పులకు పాల్పడిన వారిని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.


