పర్లాకిమిడి: మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువత భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందని, సమాజంలో వారి ఉనికి కోల్పోతారని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి దయామయ పాఢి అన్నారు. స్థానిక గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం హాల్‌లో గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా నిరోధక దినోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత జిల్లా సామాజిక సురక్షా, దివ్యాంగుల స్వశక్తీకరణ శాఖ ఆధ్వర్యంలో ఉదయం స్థానిక మహారాజాబాలుర ఉన్నత పాఠశాల నుంచి ఒక సచేతన ర్యాలీని కలెక్టర్ వరకూ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, ట్రాన్స్‌జెండర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రీతి ధారా నాయక్, ఈశ్వరీయ విశ్వవిద్యాలయం బి.కె.సుజాత సబ్ డివిజనల్ సామాజిక సురక్షా, దివ్యాంగుల స్వశక్తీకరణ అధికారి లక్కోజు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అతిగా తాగుడు వల్ల ఒడిషా పాపులర్ సినీ గాయకుడు హిమాంశు శేఖర్ అతి తక్కువ వయస్సులోనే మృతిచెందాడని, అలాగే తాగుడుకు బానిసై సొంత తల్లిని కొట్టి డబ్బులు తీసుకుని దుర్ఘటనకు గురైన ఘటనను కూడా దయామయ పాఢి తన ప్రసంగంలో తెలియజేశారు. అందువల్ల మాదక ద్రవ్యాలు, తాగుడు వల్ల సమాజంలో అనేక నేరాలకు కూడా దారి తీస్తుందని ఆయన అన్నారు. అనంతరం తాగుడు, జూదం, గంజాయికి అలవాటు పడినవారి జీవనవిధానంపై చిన్న రూపకాలు ప్రదర్శించారు.


