అమానుషం | - | Sakshi
Sakshi News home page

అమానుషం

Jun 26 2026 7:45 AM | Updated on Jun 26 2026 7:45 AM

భువనేశ్వర్‌: సమాజంలో నానాటికీ మానవీయ విలువలు అడుగంటి పోతున్నాయి. బిడ్డల కులాంతర వివాహంతో వెలివేత కారణంగా వృద్ధ మహిళ మరణానంతరం అంతిమ యాత్రకు చేయూత ఇచ్చేందుకు ఇరుగు పొరుగు నిర్దాక్షిణ్యంగా నిరాకరించారు. మృతురాలి కుటుంబీకులు ఎంత ప్రాధేయపడిన ప్రయోజనం లేకపోవడంతో అనివార్య పరిస్థితుల్లో వృద్ధ మహిళ అంతిమ యాత్ర సైకిల్‌పై నిర్వహించారు. ఈ అమానుష సంఘటన గురువారం వెలుగు చూసింది.

పశ్చిమ ఒడిశా బర్‌గఢ్‌ జిల్లా పాయికమల్‌ మండలం కొంటపొడా గ్రామంలో ఇలాంటి హృదయ విదారక సంఘటన సభ్య సమాజానికి సిగ్గు చేటుగా నిలిచింది. కొంటపొడా గ్రామస్తురాలు జయంతి బొచ్ఛా అనే వృద్ధురాలు మరణించారు. తన బిడ్డలు కులాంతర వివాహం చేసుకోవడంతో వారిని కులం నుంచి వెలివేసిన కారణంగా కులస్తులు మృత దేహాన్ని మోయడానికి నిరాకరించారు. దీంతో మృతురాలి కోడలు యజ్ఞాసిని బొచ్ఛా, మనవడు శుభం బొచ్ఛా, మనవరాలు శివాని బొచ్ఛా మృత దేహాన్ని సైకిల్‌పై శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల జాడ కొరవడడం మరింత హృదయవిదారకంగా మారింది. దుఃఖ సమయంలో ఒక నిరుపేద, నిస్సహాయ కుటుంబానికి శవం తరలించేందుకు వాహనం వంటి ప్రాథమిక సేవని కూడా స్థానిక ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు చేయలేకపోవడం ప్రజా పాలన వ్యవస్థను నిలదీసింది.

సైకిల్‌పై అంతిమ యాత్ర

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement