భువనేశ్వర్: మాజీ ఐఏఎస్ అధికారి సుజాత రౌత్ కార్తికేయన్ బిజూ జనతా దళ్ (బీజేడీ)లో చేరారు. గురువారం శంఖ భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు సీనియర్ నాయకుల సమక్షంలో బీజేడీ నాయకులు సుజాతకు ఘన స్వాగతం పలికారు. బీజేడీ అధ్యక్షుడు, శాసన సభ విపక్ష నేత నవీన్ పట్నాయక్ సమక్షంలో లాంఛనంగా చేరారు. నవీన్ పట్నాయక్ పార్టీ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు.
రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తాను
సుజాత పార్టీలో చేరిన అనంతరం ఆమె మాట్లాడారు. తాను ఒక సాధారణ కార్యకర్తలా రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తానని తెలిపారు. నవీన్ పట్నాయక్ నాయకత్వంలో పార్టీ, రాష్ట్రం కోసం పనిచేస్తానన్నారు. అనంతరం నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో తాను ప్రత్యక్షంగా పార్టీకి నాయ కత్వం వహిస్తానని ప్రకటించారు. బిజూ జనతా దళ్ తన నాయకత్వంలోనే ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. సుజాత ఒకప్పటి బీజేడీ నాయకుడు వీకే పాండియన్ భార్య. ఆమె కాలికట్ తొలి మహిళా కలెక్టర్. క్షేత్రస్థాయి నుంచి మహిళలను పైకి తీసుకురావడం, ఎస్‌ఎస్‌జీని ఎస్‌ఎంఈగా మార్చడం, ఈ–కామర్స్ ద్వారా గృహిణులకు వ్యాపారాలు కల్పించడం వంటి ఎన్నో పనులు ఆమె చేశారు. సుజాత రౌత్ నేరుగా నాయకత్వ పాత్రలోకి ప్రవేశించకుండా, పార్టీ పని ద్వారా సంస్థలో తన స్థానాన్ని సంపాదించుకోవాల్సి ఉంటుంది.


