రాయగడ: సదరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తొలగుమ్మ సమీపంలో ఓ చిరు వ్యాపారిపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేసి అతడి వద్ద గల నగదు, మొబైల్ ఫోను దోచుకెళ్లారు. దుండగులు కారులో వేగంగా అక్కడి నుండి పారిపోతుండగా రోడ్డువైపుగా వస్తున్న చిన్నారిని ఢీకొట్టారు. దీంతో కారు అదుపు తప్పి బోల్తా పడింది. వివరాల్లోకి వెళితే.. గ్రామాల్లో తిరిగి చిన్నచిన్న వస్తువులను విక్రయించి జీవనోపాధి పొందే ఒక చిరువ్యాపారి ఎప్పటిలా వెళుతుండగా తొలగుమ్మ వద్ద కారులో వస్తున్న కొంత మంది దుండగులు అడ్డగించి అతనిపై దాడి చేసి అతని వద్ద గల నగదు, మొబైల్ ఫోన్ దోచుకున్నారు. అదే సమయంలో అటువైపుగా వెళుతున్న ఒక చిన్నారి ని ఢీకొట్టిన కారు అదుపుతప్పి రోడ్డు పక్క బోల్తా పడిపోయింది. అనంతరం దుండగులు కారును అక్కడే విడిచిపెట్టి పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


