ఏళ్లుగా
నిర్మాణంలో ఉన్న పంపు హౌస్
2
కూటమి ప్రభుత్వ వైఫల్యం
ఈ రెండేళ్లలో ఎత్తిపోతల పథకం పూర్తిచేయలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉండడం దారుణం. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుచూపుతో వ్యవహరించి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో సగానికి పైగా పనులు కూడా పూర్తయ్యాయి. వాటిని సైతం పూర్తిచేయలేకపోయింది ఈ ప్రభుత్వం. ఇంతకంటే వైఫల్యం ఉంటుందా..?
– రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే, పాతపట్నం
హిరమండలం: ఆర్భాటం ఎక్కువ.. పని తక్కువ అన్నట్టు ఉంది కూటమి ప్రభుత్వం తీరు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా జిల్లాలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు నిర్మాణం కూడా పూర్తిచేయలేకపోయింది. బీఆర్‌ఆర్ వంశధార ఫేజ్–2 రిజర్వాయర్, ఎత్తిపోతల పథకం, ఉద్దానం సమగ్ర మంచినీటి పథకం.. ఇలా ఏ పథకాన్ని కూడా రెండేళ్లలో పూర్తిచేసి ప్రజలకు పూర్తిస్థాయిలో అందించలేకపోయింది. ప్రధానంగా వంశధార ప్రాజెక్టు పరిధిలోని హిరమండలం ఎత్తిపోతల పథకం ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు. దీంతో జిల్లాకు సాగు, తాగునీరు అందించాలన్న లక్ష్యం దెబ్బతినేలా ఉంది.
ఇదీ జరిగింది...
వంశధార ఫేజ్–2 రిజర్వాయర్‌కు నేరడి బ్యారేజీ నిర్మాణం కీలకం. దీనికోసం ఒడిశాతో జల వివాదం నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దూరదృష్టితో వ్యవహరించారు. ఈ మేరకు అప్పటి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ చర్చలు జరిపారు. వంశధార నదిలో హిరమండలం వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించడానికి నిర్ణయించారు. గొట్టా బ్యారేజీ కుడి ప్రధాన కాలువ నుంచి 12 టీఎంసీల నీటిని వంశధార జలాశయంలోకి చేర్చడమే లక్ష్యంగా పనులు ప్రారంభించారు. ఇందుకుగాను రూ.176.35 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. రూ.140.17 కోట్లకు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ వైఎస్సార్‌సీపీ హయాంలో శరవేగంగా పనులు ప్రారంభించారు. రెండేళ్లలో సగానికి
పైగా పనులు పూర్తి చేశారు. కానీ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం మాటలతో కాలం గడిపిందే తప్ప.. పనులు మాత్రం సజావుగా ముందుకు తీసుకెళ్లలేకపోయింది. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిధుల విడుదలలో తాత్సారం
కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. ఎత్తిపోతల పథకానికిగాను విద్యుత్ సబ్‌స్టేషన్ అవసరం. కానీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తూ వచ్చింది. గత నెలలో ఏపీ ట్రాన్స్‌కోకు సబ్‌స్టేషన్ నిర్మాణానికిగాను రూ.9.18 కోట్లు చెల్లించినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ ఇంకా సబ్‌స్టేషన్ పనులు మొదలుకాలేదు. 132 కేవీ విద్యుత్ లైన్లు సారవకోట, పాతపట్నం, హిరమండలం నుంచి మొత్తం 75 టవర్లు ఏర్పాటు చేసి సబ్‌స్టేషన్‌కు అనుసంధానం చేయాలి. వీటి ఏర్పాటుకు సంబంధించి భూములను గుర్తించాలి. రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి. కానీ ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని సైతం ప్రారంభించలేదు. దీంతో ఎత్తిపోతల పథకం నిర్మాణంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
ప్రకటనలకే పరిమిత
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 2026 ఖరీఫ్‌నకు రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన చేశారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు గమినిస్తే వచ్చే ఏడాది ఖరీఫ్‌నకు కూడా ఇది సాధ్యమవుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎత్తిపోతల పథకం అందుబాటులోకి వచ్చి రిజర్వాయర్‌లో నీటిని స్థిరీకరిస్తే.. వంశధార కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా 2.11 లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందుతుంది. నారాయణపురం ఆనకట్ట కింద 18,527 ఎకరాలు, హెచ్‌ఎల్‌సీ కింద ఉన్న 5 వేల ఎకరాలకు సాగునీటి స్థిరీకరణ జరుగుతుంది. ఆపై ఉద్దానం ప్రాజెక్టుకు 1.12 టీఎంసీల తాగునీరు అందించవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో ఎత్తిపోతల పథకం పూర్తయితే కానీ ఈ పనులు చేయలేం. కానీ ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
ఎత్తిపోతల పథకంలో ఎడతెగని జాప్యం
విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణంపై నిర్లక్ష్యం
ప్రచార ఆర్భాటంతోనే గడిపేసిన కూటమి ప్రభుత్వం
ఈ ఖరీఫ్‌లో వంశధార నీరు లేనట్టే


