నిధుల కాజేతే లక్ష్యం..! | - | Sakshi
Sakshi News home page

నిధుల కాజేతే లక్ష్యం..!

Jun 25 2026 1:00 AM | Updated on Jun 25 2026 1:00 AM

పంచాయతీల నిధులపై కూటమి నేతల కన్ను

సర్పంచ్‌లు లేకపోవడంతో అదునుగా భావిస్తున్న నాయకులు

అధికారులపై రాజకీయ ఒత్తిడి తెస్తున్న వైనం

ఇలా ఒత్తిళ్లు..!

కొన్ని మండలాల్లో పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. గ్రామాల్లో చేయాల్సిన పనుల జాబితాలను నేతలే సిద్ధం చేసి అధికారులకు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం వ్యవహరించే అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమ అనుచరులతో ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు అతిక్రమించి నిధులు ఖర్చు చేస్తే భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడంతో పలువురు అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో పంచాయతీలో ఒక పనికి ఒకరిద్దరూ కాకుండా ఏకంగా కూటమిలోని నలుగురు, ఐదుగురు చొప్పున పోటీపడటంతో అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు తలనొప్పి తెచ్చిపెడుతోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే నిధులను ఎలాగైనా స్వాహా చేయాలని చూస్తున్న నేతల ప్రయత్నాలు, ఒత్తిళ్లుకు అధికారులు తలొగ్గకుండా నిధులను పరిరక్షించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

పనుల పేరుతో నిధులు కాజేసే ప్లాన్‌

గ్రామాల్లో మురుగు నీటి కాలువలు, రోడ్ల మరమ్మతులు, విద్యుత్‌, తాగునీరు, పారిశుద్ధ్య పనులు ఇలాంటి చిన్నపాటి పనులు పేరుతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి అవసరం లేని పనులను కూడా అత్యవసరంగా చూపించి నిధులు ఖర్చుచేసే మార్గాలు వెదుకుతున్నారనే విమర్శలొస్తున్నాయి. కొన్నిచోట్ల పనులు చేయకనే బిల్లు గురించి చర్చలు మొదలయ్యాయని, మరికొన్ని చోట్ల పనులు పూర్తయ్యాయని చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. గ్రామ ప్రజల అవసరాలకంటే నేతలకు లబ్ధి కల్పించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

హిరమండలం: పంచాయతీల్లోని నిధులపై కూటమి నేతలు కన్నేశారు. గ్రామ పంచాయతీల ఖాతాల్లో ఉన్న నిధులను ఏదో రూపంలో బయటకు తీయాలని కొందరు వ్యూహాలు రచిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. గ్రామాల అవసరాలకు వినియోగించాల్సిన నిధులను మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో 912 పంచాయతీలున్నాయి. ఏప్రిల్‌తో గ్రామ సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రస్తుతం నిర్ణయాధికారం ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వచ్చింది. దీంతో గ్రామాల్లో రాజకీయ నాయకుల జోక్యం తగ్గుతుందని భావించినప్పటికీ.. పరిస్థితులు దీనికి భిన్నంగా కనిపిస్తున్నాయి. నేరుగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేకపోయినా, అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి తమకు అనుకూలంగా పనులు మంజూరు చేయించుకోవాలనే ప్రయత్నాలు కూటమి నేతలు చేస్తున్నట్లు సమాచారం. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పంచాయతీలు, ప్రత్యేక అధికారుల మ్యాపింగ్‌ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. దీంతో కొత్త పనులకు అనుమతులు, బిల్లుల చెల్లింపులు, నిధుల బదిలీల విషయంలో అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితి కొందరు కూటమి నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని వినియోగించే అవకాశం లేకపోవడంతో, వాటిపై సరికొత్త వ్యూహ రచన చేసినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement