తవ్వారు.. వదిలేశారు..! | - | Sakshi
Sakshi News home page

తవ్వారు.. వదిలేశారు..!

Jun 25 2026 1:00 AM | Updated on Jun 25 2026 1:00 AM

గట్టు బలహీనంగా మారింది

చెరువు గట్టుకు రక్షణ గోడ నిర్మాణానికి గాడి తవ్వకం

సకాలంలో పనులు పూర్తిచేయని వైనం

గాడిలోకి చేరుతున్న వర్షపు నీరు

గట్టు బీటలతో ఆందోళనలో అన్నదాతలు

కొత్తూరు: కూటమి ప్రభుత్వంలో హడావుడిగా నాయకులు రోడ్ల పనులను ప్రారంభించి.. సకాలంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా స్థానికులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని రాయల గ్రామం నుంచి ఎర్రటిగూడ వరకు రోడ్డు పనులు మంజూరు చేశారు. దీంట్లో భాగంగా పనులు ప్రారంభించారు. ఈ రోడ్డు ఊరు చెరువు గట్టుపై నుంచి వెళ్లాల్సి ఉండడంతో చెరువు గట్టుకు రక్షణ గోడ నిర్మాణం కోసం మూడు నెలల క్రితం గాడిని తవ్వారు. అయితే అనంతరం గోడ నిర్మాణం చేపట్టకుండా వదిలేయడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. నెలలు గడుస్తున్నా రక్షణ గోడ నిర్మాణ పనులు చేయకపోవడంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు గాడిలో నీరు చేరుతోంది. ఫలితంగా చెరువు గట్టు బలహీనపడింది. ఈ చెరువు కొండల దిగువ భాగాన ఉన్నందున చిన్నపాటి వర్షాలకు చెరువులోకి నీరు చేరడం వలన గాడిలో నీరు ఎక్కువవుతోంది. దీంతో గట్టు పలుచోట్ల బలహీనపడడంతో కూలిపోయే అవకాశం ఉంది. ఒకవేళ గట్టు కూలిపోయినట్లయితే చెరువులో నీరు పొలాల్లోకి చేరుతుంది. ఫలితంగా మొలక దశలో ఉన్న వరినారు, వరి వెదలు నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు గాడి తవ్వడం వలన రోడ్డు మీద మట్టి నిండిపోవడంతో రోడ్డు మీద ప్రయాణం ప్రమాదకరంగా మారింది. వర్షం కురిసే సమయంలో ఈ రోడ్డు నుంచి రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఈ రక్షణ గోడ నిర్మాణం చేపట్టాలని ఇంజినీరింగ్‌ అధికారులకు రైతులు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని వాపోతున్నారు.

రోడ్డు పనుల కోసం చెరువు గట్టు తవ్వేశారు. అయితే సకాలంలో పూర్తి చేయకపోవడంతో గట్టు పూర్తిగా బలహీనపడింది. పలుచోట్ల బీటలు వారింది. వర్షాలకు చెరువులో ఎక్కువ నీరు చేరినట్లయితే చెరువు గట్టు కొట్టుకుపోయి పంట పొలాల్లోకి నీరుచేరే ప్రమాదం ఉంది. తవ్విన గాడి పూడ్చకపోతే ఈ ఏడాది పంట చేతికొచ్చే అవకాశం లేదు. – రాగాల సులోచన,

ఆయకట్టు రైతు, రాయల గ్రామం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement