శివకుమార్‌ను కఠినంగా శిక్షించాలి | - | Sakshi
Sakshi News home page

శివకుమార్‌ను కఠినంగా శిక్షించాలి

Jun 25 2026 1:00 AM | Updated on Jun 25 2026 1:00 AM

పలాస: సోంపేట మండలం గొల్లూరు గ్రామానికి చెందిన శివకుమార్‌ను కఠినంగా శిక్షించాలని, అతని కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లలకు తగిన న్యాయం చేయాలని పౌరహక్కుల సంఘం, ఇతర ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. గొల్లూరులో జరిగిన దారుణ ఘటనపై అంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో వివిధ ప్రజాసంఘాల నాయకుల నిజ నిర్ధారణ కమిటీ మంగళవారం ఆ గ్రామానికి వెళ్లి పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో జయరాం, రాజారావు, శివకుమార్‌ అనేవారు ముగ్గురు అన్నదమ్ములు. వీరికి తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తి మూడున్నర ఎకరాలను సమానంగా పంచుకుందామని రెండోవాడు రాజారావు ప్రతిపాదించారు. ఈ విషయంపై అన్నదమ్ముల మధ్య ఏకాభిప్రాయం కుదురకపోవడంతో పోలీసుస్టేషన్‌, గ్రామ పెద్దల వరకు వెళ్లింది. రాజారావుకు వారసత్వం వాటా ఇవ్వడానికి మిగతా ఇద్దరు ఇష్టపడకపోవడంతో ఆయన మానసికంగా బాధపడుతూ చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన రాజారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త చనిపోవడంతో ఆ కుటుంబానికి ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. దీంతో గ్రామ పెద్దలు ముగ్గురికి ఆస్తిని సమానంగా పంచారు. అయితే వారికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉంది. దీనికి మిగతా ఇద్దరు అన్నదమ్ములు అడ్డుతగిలారు. దీంతో రాజారావు భార్య ఊర్వశి కోర్టును ఆశ్రయించింది. వారికి కోర్టు నోటీసులు రావడంతో కక్ష గట్టిన శివకుమార్‌ ఒక రోజు ఇంట్లో ఉన్న ఊర్వశిని అతి దారుణంగా హత్య చేసి పారిపోయాడు. అందువలన నిందుతుడిని కఠినంగా శిక్షించాలని డిమాండు చేశారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పత్తిరి దానేసు, జిల్లా కమిటీ నాయకులు సోమనాథం, వైకుంఠరావు, జోగారావు, వివిధ ప్రజాసంఘాల నాయకులు మద్దిల ధర్మారావు, పుచ్చ దుర్యోధనరావు, సాలిన వీరాస్వామి, బొడ్డు నాగమణి, సరస్వతి, దాసరి శ్రీరాములు, వాసుదేవరావు, బొడ్డు జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement