శ్రీకాకుళం కల్చరల్: జూలై 11, 12 తేదీల్లో విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో సాహితీ స్రవంతి, మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా రాష్ట్రస్థాయి సాహిత్య సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఎంబీ విజ్ఞాన కేంద్రం బాధ్యులు గుండు నారాయణరావు, సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు, సీనియర్ జర్నలిస్ట్ నల్లి ధర్మారావులతో కలిసి విలేకరుల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్ని జిల్లాల నుంచి ప్రసిద్ధ కవులు, రచయితలతో పాటు యువకులు, వర్దమాన రచయితలు సుమారు 300 మందికి పైగా ఈ సమ్మేళనంలో పాల్గొంటారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రచయితలు, కవులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్ కేతవరపు శ్రీనివాస్, నెట్టిమి రమణారావు, గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం బాధ్యులు పి.సుధాకరరావు తదితరులు పాల్గొన్నారు.


