పలాస: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు తక్కువ ఉన్నారనే నెపంతో వాటిని కుదించే నిర్ణయాన్ని ప్రభుత్వం మార్చుకోవాలని పీడీఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వినోద్‌కు మార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సూదికొండ కాలనీలోని పీడీఎస్‌యూ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రేషనలైజేషన్ పేరుతో విద్యార్థులు తక్కువగా ఉన్నారనే నెపంతో 8, 9, 10 తరగతులను కుదించి, వారిని సమీప పాఠశాలలకు పంపించాలనే ఆలోచన సరైనది కాదన్నారు. దీనివల్ల ఆర్థిక భారం వలన ఇతర పాఠశాలలకు విద్యార్థులు వెళ్లలేక మధ్యలో చదువుకు స్వస్తి పలికే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల ఆదివాసీ పిల్లలు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, వంటమనిషి, వాచ్‌మెన్ తదితర పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు.


