● రాష్ట్ర న్యాయ, ప్రజాపనుల శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ ● జిల్లా కేంద్రంలో వికసిత్ ఒడిశా సమ్మేళనం
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో రోడ్లు, భవనాలు, పర్యాటక కేంద్రాలు, విద్య, వైద్యం వికాసానికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర అబ్కారీ, న్యాయ, ప్రజాపనుల శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా స్థానిక గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం మందిరంలో వికసిత్ ఒడిశా సమ్మేళనం ‘వికాస్ ధారా, ఒడిశా సారా..’ కార్యక్రమం ప్రారంభించారు. పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, మోహనా శాసన సభ్యుడు దాశరథి గొమాంగో, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, కలెక్టర్ అక్షయసునీల్ అగర్వాల్, ఎస్పీ మీనా, పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి, డీఎఫ్‌ఓ నాగరాజు, డీపీఓ ప్రకాష్‌రావు, ఎస్.డి.సీ.చైర్మన్ కామదేవ్ బోడోనాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గజపతి జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, అదే సమయంలో కలెక్టర్, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, అధికారులు సహకారం అందించాలని కోరారు.
ప్రాజెక్టులకు నిధులు మంజూరు..
గజపతి జిల్లాలో రూ.2.09 కోట్లతో గండాహాతి, గుద్‌గురా, మంకడాడియా జలపాతాలు అభివృద్ధి చేస్తామని, పర్లాకిమిడి గుణుపురం, రాయగడ, తెలువళ్ళి రైల్వేలైను పొడిగిస్తామని మంత్రి ప్రకటించారు. ప్రజల డిమాండ్ మేరకు పర్లాకిమిడి నుంచి గుమ్మగెడ్డ వరకూ బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.20 కోట్లతో టెండర్లు పిలిచామని చెప్పారు.స్థానిక శ్రీజగన్నాథ మందిరం పునరుద్ధరణ పనులకు రూ.20 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల కొరత వేధిస్తోందని, కృష్ణచంద్ర గజపతి కళాశాలకు విశ్వవిద్యాలయం హోదా కల్పించాలని ఈ సందర్భంగా జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.పలువురు ప్రతినిధులను సత్కరించిన అనంతరం ఎస్.కె.సి.జీ.కళాశాలలో వికాస్‌రో ధారా, ఒడిషా సారా స్టాల్స్‌ను ఎమ్మెల్యేలు దాశరథి గొమాంగో, రూపేష్ పాణిగ్రాహిలు ప్రారంభించారు.


