కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లాలో సారా వ్యతిరేక ఉద్యమం క్రమేనా గ్రామాలకు విస్తరిస్తుంది. ఒక్కొక్క పల్లెలో జరుగుతున్న పరిణామా లు పరిశీలిస్తున్న గిరిజన మహిళలు తమ గ్రామాల్లోనూ అమలు చేయాలంటూ ఉద్యమ బాట పడుతున్నారు. పపడాహండి సమితిలో పలు గ్రామాలలో సారా విక్రయ దుకాణాలపై మహిళలు సామూహికంగా దాడులు చేస్తున్నారు. సారా ప్యాకెట్లను రోడ్లపై విసిరేసి ధ్వంసం చేస్తున్నారు. మరోవైపు బీహారి మద్య తయారీ కేంద్రాల నుంచి తమ గ్రామాలకు సారా రాకుండా పహారా కాస్తున్నారు. సారా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనేందుకు వ్యాన్‌లు, ఆటోలలో మహిళలు తరలివస్తున్నారు. అయితే అటువంటి వాహనాలపై ఆర్‌టీఓ సిబ్బంది భారీ జరిమానాలు విధిస్తుండటం పట్ల మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జి మండిపడ్డారు.
హెల్ప్‌డెస్క్‌లపై వివాదం
జయపురం: పట్టణంలోని విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో హెల్ప్ డస్క్‌ల ఏర్పాటుపై బీజేపీ, బీజేడీ విద్యార్థి సంఘాల నేతల మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. వర్సిటీలో యూజీ, పీజీలలో ప్రవేశించే విద్యార్థులకు సహాయం చేసేందుకు ఏబీవీపీ విద్యార్థులు, బీజేడీ విద్యార్థులు హెల్ప్ డస్క్‌లు(సహాయక కేంద్రాలు) నెలకొల్పటం వివాదాస్పదమైంది. విద్యార్థుల మధ్య వివాదానికి కారణమైన హెల్ప్ డస్క్‌లను తొలగించేందుకు వర్సిటీ రిజిస్ట్రార్ మహేశ్వర చంద్ర నాయక్ వచ్చి ఉభయ వర్గాల మధ్య సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. ఒక దశలో రిజిస్ట్రార్‌తో ఏబీవీపీ జయపురం నేత జ్యోతీ రంజన్ పాణిగ్రహి వాగ్వాదానికి దిగారు. రాజకీయ ఒత్తిడితో పనిచేస్తున్నారు, ఈ వివాదం పరిష్కరించటం మీ వల్ల కాదు, వైస్ చాన్సలర్‌ను పిలవండి అని నిలదీయటంతో వివాదం పెరిగి పరిస్థితి జఠిలమైంది. సకాలంలో పోలీసులు వచ్చి ఉభయవర్గాలకు సమాధానపరిచారు.
రాయగడ: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక జాబితా సవరణ కార్యక్రమంలో జిల్లా విశేష విజయాన్ని సాధించింది. జిల్లాలో సేకరించిన ఓటర్లకు సంబంధించిన అన్ని వివరాలను 100 శాతం డిజిటలైజేషన్ చేయడంలో అధికారులు పూర్తిగా సఫలీకృతులయ్యారని జిల్లా కలక్టర్ అశుతోష్ కులకర్ణి ప్రసంశించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో రాష్ట్రంలోనే రెండో జిల్లాగా రాయగడ నిలవడం అందరి కృషి పలితమేనన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఈ మేరకు నిర్వహించిన సమీక్షా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా మే 30 నుంచి ఇంటింటా సర్వే ప్రారంభమైందని వివరించారు. బూత్ స్థాయి అధికారులు ప్రతీ ఓటరు ఇంటికి వెళ్లి వివరాలను సేకరించడం, ధ్రువీకరించడం, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ వంటి పనులు సక్రమంగా నిర్వహించడంతోనే ఈ ఫలితం దక్కిందన్నారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 895 మంది బీఎల్‌ఓలు విధులు నిర్వహించారన్నారు. 7,14,500 ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారన్నారు. సేకరించిన అన్ని ఫారాలను పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేయడంతోపాటు వాటి ధ్రువీకరణ ప్రక్రియ కూడా విజయవంతంగా కొనసాగుతుందన్నారు. ఎన్నికల శాఖ సక్రమ నిర్వహణతో పాటు బీఎల్‌ఓలు, ఇతర ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ ఫలితం సాధ్యమైందన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో జూలై 5 నుంచి ఆగష్టు 4వ తేదీ వరకు ఓటరు జాబితాపై దావాలు, అభ్యంతరాలు, స్వీకరణ చేపట్టనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. వచ్చిన అభ్యంతరాలు, దరఖాస్తులను సెప్టెంబర్ 2వ తేదీ నాటికి పరిష్కరించి, సెప్టెంబర్ 6వ తేదీన ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు.


