ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ఉత్పత్తి బంద్‌ | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ఉత్పత్తి బంద్‌

Jun 25 2026 12:54 AM | Updated on Jun 25 2026 12:54 AM

● రాయగడ ప్రధాన ఆస్పత్రిలో రెండు ప్లాంట్లలో నిలిచిన ఉత్పత్తి ● రోగుల్లో తీవ్ర ఆందోళన

● రాయగడ ప్రధాన ఆస్పత్రిలో రెండు ప్లాంట్లలో నిలిచిన ఉత్పత్తి ● రోగుల్లో తీవ్ర ఆందోళన

రాయగడ : కొవిడ్‌ మహమ్మారి సమయంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రధాన మంత్రి కేర్స్‌, ముఖ్యమంత్రి కేర్స్‌ నిధులతో రాయగడ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన రెండు పీఎస్‌ఏ మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లు ప్రస్తుతం పనిచేయడం లేదు. దీంతో రోగులు, బంధువుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 2021 అక్టోబరు 7న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌ విధానంలోఈ ఆక్సిజన్‌ ప్లాంట్లను ప్రారంభించారు. ఆస్పత్రిలోని వివిధ వార్డులకు పైప్‌లైన్‌ల ద్వారా నిరంతర ఆక్సిజన్‌ సరఫరా చేయడమే వీటి ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం రెండు ప్లాంట్లలోనూ ఉత్పత్తి నిలిచిపొవడంతో ఆస్పత్రి యాజమాన్యం ఆక్సిజన్‌ సిలిండర్లను, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లపై ఆధారపడాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ఇటీవల జరిగిన గవర్నింగ్‌ బాడీ సమావేశంలో కూడా ఆక్సిజన్‌ ప్లాంట్ల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లలేదని తెలుస్తోంది. రోగి సంక్షేమ సమితి నిధులను వినియోగించి మరమ్మతులు చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రిలో ఇద్దరు మెడికల్‌ మేనేజర్లు, ఒక సూపరింటెండెంట్‌ ఉన్నప్పటికీ ఇలాంటి దుస్థితి ఎలా ఏర్పడిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఎమ్మెల్యే సందర్శన..

విషయం వెలుగులోకి రావడంతో రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక మంగళవారం సందర్శించారు. ఏడీఎం (మెడికల్‌)తో కలిసి ఆక్సిజన్‌ ప్లాంట్ల పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించి ఆక్సిజన్‌ సరఫరా వ్యవస్థను తనిఖీ చేశారు. 24 పడకల సామర్థ్యం ఉన్న ఈ కేంద్రంలో ప్రస్తుతం 20 మంది శిశువులు చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. రోగుల సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా వెంటనే చర్యలు తీసుకుని ఆక్సిజన్‌ ప్లాంట్లను తిరిగి పనిచేసేలా చూడాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

సాంకేతిక లోపమే కారణమా..

డీఎంఓ, డీహెచ్‌హెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రశాంత కుమార్‌ మిశ్రా మాట్లాడుతూ ఆక్సిజన్‌ ప్లాంట్లలో సాంకేతిక లోపం తలెత్తడంతో సోమవారం రాత్రి పది గంటల నుంచి ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. అయితే ఆస్పత్రిలో సుమారు 20 రోజుల అవసరాలకు సరిపడే ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉన్నందున సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేశారు. భువనేశ్వర్‌ నుంచి సాంకేతిక నిపుణుల బృందం వచ్చి మరమ్మతులు పూర్తి చేసిన వెంటనే ప్లాంట్‌ పూర్వ స్థితికి చేరుతుందన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement