దహిఖాల్ గ్రామంలో కొనసాగుతున్న
ఆందోళనలు
సమస్యను అసెంబ్లీలో ప్రస్తావిస్తా:
బిసంకటక్ ఎమ్మెల్యే హికక
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి దహిఖాల్ గ్రామ సమీపంలో బహుళజాతి సంస్థ వేదాంత అల్యూమినా కంపెనీ ప్రతిపాదించిన బాకై ్సట్ డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. యార్డు ఏర్పాటుతో ప్రజల జీవనం, ఆరోగ్యం, పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందంటూ ఈ నెల 5 నుంచి హటొ దొహిఖాల్‌లో వద్ద శాంతియుత రిలే నిరసన చేపట్టారు. దీనిలో భాగంగా బుధవారం బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక శిబిరాన్ని సందర్శించి నిరసనకారులతో చర్చించారు. వారి సమస్యలు, డిమాండ్లను విన్న అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో జరిగే శాసనసభలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ డంపింగ్ కార్యకలాపాల వల్ల భారీ వాహనాల రాకపోకలు పెరిగి ధూళి, వాయు కాలుష్యం తీవ్రంగా పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్వాసకోస, చర్మ సంబంధిత వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ప్రజల జీవనోపాధి, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్నారు. ప్రజా ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ప్రతిపాదిత బాకై ్సట్ డంపింగ్ ప్రాజెక్టును నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పీసీసీ సాధారణ కార్యదర్శి దుర్గాప్రసాద్ పండా, డీసీసీ ఉపాధ్యక్షుడు శంకర్షన్ మంగరాజ్, సమితి కాంగ్రెస్ అధ్యక్షుడు నీలాంబర్ బిభార్, ఎంపీ ప్రతినిధి నీలాంబర్ బెహరా, యువ కాంగ్రెస్ నాయకుడు బాదల్ బెహరా తదితరులు పాల్గొన్నారు.


