కొరాపుట్: పేదలు పింఛన్లు అందక ఆకలితో చనిపోతున్నా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి బాధ్యత లేకుండాపోయిందని ప్రతిపక్ష బీజేడీకి చెందిన మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జి మండిపడ్డారు. బుధవారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండో ఆర్థిక రాజధాని వంటి గంజాంలో సావిత్రి దొర (66) అనే వృద్ధురాలు నెలవారీ పింఛన్ అందక ఆకలితో మృతిచెందడం బాధాకరమన్నారు. నబరంగ్‌పూర్ జిల్లాలో మూడు నెలలుగా పేదలకు పెన్షన్లు అందడం లేదన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా మూడు నెలల పెన్షన్ 15 రోజులలో పేదలకు అందజేస్తామని హామీ ఇచ్చి గడువు ముగిసినా ఫలితం లేకపోయిందన్నారు. నబరంగ్‌పూర్ జిల్లాలో 1656 మంది దివ్యాంగులకు పింఛన్ అందడం లేదన్నారు. కేవలం వెయ్యి రూపాయలతో జీవనం సాగించే దివ్యాంగులు ఆ డబ్బులు కూడా అందక విలవిల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 17,130 మంది వితంతువులు తమ బాధ ఎవరికీ చెప్పుకోవాలో తెలియక కుమిలిపోతున్నారని
పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఇప్పటివరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ప్రభుత్వం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ఎక్కడైనా పింఛన్‌దారులలో మృతి చెందితే ఆ స్థానంలో మాత్రమే కొత్త పింఛన్ మంజూరు చేస్తున్నారని చెప్పారు. ఇది సరికాదన్నారు. ఎన్‌ఎస్‌ఏపీ పథకం కింద అర్హులందరికీ పెన్షన్ ఇవ్వాలన్న నిబంధన తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పపడాహండి సమితిలో పద్మన్ బిసోయి విధి నిర్వాహణలో చనిపోతే నేటికీ ప్రభుత్వ పరంగా సాయం అందలేదన్నారు. దాంతో అతని భార్య బబితా బిసోయి వృద్ధాప్య పెన్షన్ రు.1000పై ఆధారపడి జీవిస్తోందన్నారు. ఆ పెన్షన్ కూడా మూడు నెలలుగా అందడం లేదన్నారు. వారం రోజుల్లోగా ఆమెకు న్యాయం జరగకపోతే కలెక్టర్ నివాసం ముందు ఆందోళన చేస్తామని ప్రదీప్ మజ్జి హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రధాని, మాజీ జెడ్పీ ప్రెసిడెంట్ మంజులా మజ్జి, బీజేడీ నాయకులు భీమో పూజారి, ప్రమోద్ రథ్, లల్లూ త్రిపాఠి, నాగేంద్ర పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.


