రాయగడ: బిల్లు చెల్లింపులు జరిపించేందుకు కాంట్రాక్టర్ నుంచి రెండు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రాయగడ గ్రామీణాభివృద్ధి శాఖ (ఆర్‌డీ) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రసన్నకుమార్ పట్నాయక్ విజిలెన్స్ అధికారులకు మంగళవారం రాత్రి పట్టుబట్డారు. బిల్లు ఆమోదం కోసం డబ్బులు డిమాండ్ చేయడంతో బాధిత కాంట్రాక్టర్ విజిలెన్స్ శాఖను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు కాంట్రాక్టర్ ఇంజినీర్ నివాసంలో లంచం మొత్తాన్ని అందజేస్తుండగా రాయగడ విజిలెన్స్ డీఎస్పీ సూర్యకాంతి టక్రి, అభయ ప్రధాన్ నేతృత్వంలో 10 మంది సభ్యుల బృందం దాడి చేశారు. రెండు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆదాయానికి మించిన ఆస్తులపై అనుమానాల నేపథ్యంలో నయాగడ్ జిల్లాకిల్లా ప్రాంతంలోని ఆయన నివాసం, భువనేశ్వర్, ఇతర ప్రదేశాల్లోనూ సోదాలు నిర్వహించారు. ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయాల్సి ఉన్న ప్రసన్నకుమార్ పట్నాయక్ విజిలెన్స్‌కు చిక్కడం చర్చనీయాంశంగా మారింది.


