ముమ్మరంగా యువతిపై దాడి కేసు దర్యాప్తు | - | Sakshi
Sakshi News home page

ముమ్మరంగా యువతిపై దాడి కేసు దర్యాప్తు

Jun 24 2026 1:29 AM | Updated on Jun 24 2026 1:29 AM

ముమ్మరంగా యువతిపై దాడి కేసు దర్యాప్తు

ఇప్పటికే 24 మంది అరెస్టు

పరారీలో ఉన్నవారి గురించి గాలింపు

రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్‌ ప్రాంతంలో ఓ యువతిపై జరిగిన దాడికి సంబంధించిన కేసును పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 24 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనను అత్యంత సున్నితమైన రెడ్‌ ప్లాగ్‌ కేసుగా గుర్తించి క్రైం బ్రాంచ్‌కు చెందిన మహిళా, శిశు నేరాల విభాగం పర్యవేక్షణలో విచారణ కొనసాగుతుంది. ఈ కేసు దర్యాప్తును పరివేక్షిస్తున్న ఏడీజే ఎస్‌. పైనీ సోమవారం భువనేశ్వర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ ఘటనలో పాల్గొన్న ఒక్క నిందితుడ్ని కూడా వదిలిపెట్టమని స్పష్టం చేశారు. చట్టప్రకారం కఠినతరమైన శిక్షలు పడేలా చూస్తామన్నారు.

ఒడిశా ప్రతీకకు మచ్చ

కళ్యాణసింగుపూర్‌లో జరిగిన ఘటన రాష్ట్రం, సమాజం సిగ్గుపడేలా చేసిందని ఏడీజే సైనీ వ్యాఖ్యానించారు. ఒడిశా ఇలాంటి ఘటనలు జరిగే రాష్ట్రం కాదని అన్నారు. అయితే ఇటువంటి తరహా ఘటనలు భవిష్యత్‌లో పునరావృత్తం కాకుండా పోలీస్‌ యంత్రాంగం పూర్తి చర్యలు చేపడుతుందని ఆకాంక్షించారు. అదేవిధంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా తమవంతు ప్రయత్నాన్ని చేయాలని పిలుపునిచ్చారు. బాధితురాలిని ప్రమాదం నుంచి రక్షించిన వ్యక్తికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే బాధితురాలికి రాష్ట్ర పోలీస్‌ శాఖ తరఫున అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

కోర్టు విచారణను పర్యవేక్షిస్తాం

ఈ కేసు దర్యాప్తు మాత్రమే కాకుండా, కోర్టులో విచారణ జరిగే దశలో కూడా పోలీస్‌ శాఖ పర్యవేక్షణ కొనసాగుతోందని సైనీ వెల్లడించారు. నిందితులకు గరిష్ట శిక్షలు పడేలా పటిష్టమైన ఆధారాలను సమర్పించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు.

ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన సామాజిక సంస్థ

యువతిపై దాడి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఈ నేపథ్యంలో న్యాయం కోసం పోరాటం కుటుంబం అనే సంస్థ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సుబ్రత్‌ కుమార్‌ దాస్‌ జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్వయంగా జోక్యం చేసుకుని ఒడిశాకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని పంపించాలని కోరారు. అదేవిధంగా బాధితురాలికి తగిన పరిహారం అందించడంతో పాటు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పిటిషన్‌లో రాయగడ కలెక్టర్‌, ఎస్‌పీ, డీజీపీ, హోం సెక్రటరీ, ముఖ్యమంత్రి, గవర్నర్‌లను కూడా పక్షాలుగా చేర్చినట్లు సమాచారం.

ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి

పిల్లల అపహరణ అనుమానంతోపాటు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఎవరిపై కూడా దాడులు చేయడం తగదని పోలీసులు కోరుతున్నారు. ఏమైనా అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని ఏడీజీ సైనీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వదంతులు, అనుమానాల ఆధారంగా మూకదాడులకు పాల్పడటం తీవ్రమైన నేరమని హెచ్చరించారు.

ఎస్పీ ప్రత్యేక దర్యాప్తు

యువతిపై అమానుష దాడికి సంబంఽధించి వాస్తవాలు తెలుసుకునేందుకు ఎస్పీ రాజ్‌ ప్రసాద్‌ స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ సిబ్బందిని, దాడి సమయంలో ఉన్న వారిని కలిసి వివరాలు సేకరించారు. అలాగే ఘటన జరిగిన సమయంలో పోలీసుల పాత్ర ఎలా ఉండేది, ఎంతవరకు స్పందించారు అనే విషయాలను ఆయన క్షుణ్నంగా పరిశీలించారు. అనంతరం ఇంతాలిగుడ గ్రామానికి వెళ్లిన ఎస్‌పీ ఆ గ్రామ ప్రజలతో సమావేశమయ్యారు. వారు చెప్పిన మాటలను,వివరాలను సేకరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement