రాయగడ: రాష్ట్ర ప్రభుత్వ గృహ, పట్టణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో స్థానిక బిజూ పట్నాయక్ ఆడిటోరియంలో మంగళవారం జనకల్యాణ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండో ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. వీధి వ్యాపారులను వివిధ సామాజిక భద్రత, సంక్షేమ పథకాలతో అనుసంధానించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. జన కల్యాణ మేళాలో వీధి వ్యాపారులను ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పథకాలు, ప్రధానమంత్రి శ్రమ యోగి మాంధన్, జనధన్ యోజన, మాతృ వందన యోజన తదితర మొత్తం ఎనిమిది ముఖ్య సంక్షేమ పథకాలతో అనుసంధానం చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా 123 మంది కొత్త వీధి వ్యాపారులను గుర్తించారు. తాజాగా రుణాలు మంజూరైన ఇద్దరు వ్యాపారులకు చెక్కులు అందజేశారు. అలాగే మరో పది మంది కొత్తవీధి వ్యాపారులను సన్మానించారు. వీధి వ్యాపారుల నైపుణ్యాభివృద్ధి, సురక్షిత ఆహార విక్రయాలను ప్రొత్సాహించే లక్ష్యంతో ఆహర భద్రత, పరిశుభ్రతపై ప్రత్యేక శిక్షణ కల్పించారు. కార్యక్రమంలో రాయగడ మున్సిపల్ చైర్మన్ మహేష్ పట్నాయక్, ఎస్‌డీసీ వైస్ చైర్మన్ మంజుల మినియాక, మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల కౌన్సిలర్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు పాల్గొన్నారు.


