కొనసాగుతున్న అరెస్టులు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న అరెస్టులు

Jun 23 2026 2:04 AM | Updated on Jun 23 2026 2:04 AM

రాయగడ: కల్యాణ సింగుపూర్‌లో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ నెల 16 వ తేది అర్ధరాత్రి ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌ ప్రాంతానికి చెందిన అర్పిత సుతారియా, గుజరాత్‌లోని సూరత్‌ ప్రాంతానికి చెందిన సుమన్‌ ఝా అనే ఇద్దరు యువతీ, యువకులపై గ్రామస్తులు దాడి చేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. పిల్లలు ఎత్తుకెళ్లేవారంటూ గ్రామస్తులు అనుమానించి వారిపై దాడికి పాల్పడ్డారు. మహిళ అని చూడకుండా ఆమెను వివస్త్రను చేసి దాడి చేయడం కలకలం రేపింది. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు చేపట్టినప్పటికీ యువతి వస్త్రాలను చించివేయడం వంటి చర్యలకు తీవ్రంగా స్పందించిన పోలీస్‌ శాఖ ఈ ఘటనను రెడ్‌ ఫ్లాగ్‌ గా గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే యువతీ, యువకులపై దాడి చేసిన ఘటనలో పోలీసులు అరెస్టుల పరంపర కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికి 24 మందిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఇదిలాఉండగా కల్యాణసింగుపూర్‌లో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారం నాడు పోలీసులు ప్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు.

క్రైం బ్రాంచ్‌ దర్యాప్తునకు ఆదేశాలు

ఈ ఘటనకు సంబంధించి స్పందించిన రాష్ట్ర పోలీస్‌ శాఖ డీజీ జొగేష్‌ బహదూర్‌ ఖురానియా ఘటనపై నిజానిజాలు తెలుసుకునేందుకు క్రైం బ్రాంచ్‌ మహిళ, శిశు అపరాధ నివారణ శాఖకు దర్యాప్తు కోసం ఆదేశించినట్లు సమాచారం. ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు కల్యాణసింగపూర్‌, ఘటన చోటు చేసుకున్న ఇంతాలిగుడ ప్రాంతంలో త్వరలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసుల అప్రమత్తమయ్యారు. ఒకవైపు ప్లాగ్‌ మార్చ్‌ మరొవైపు దాడికి పాల్బడిన నిందితులను అరెస్తు చేసే ప్రక్రియలను వేగవంతం చేశారు.

యువతీ, యువకుల దాడికి సంబంధించి అరెస్టులు కొనసాగుతున్న నేపథ్యంలో కల్యాణసింగుపూర్‌ కు సమీపంలొ గల ఇంతాలిగుడ గ్రామంలో పురుషులంతా పరారైపోయారు. మరికొందరిని అరెస్టు చేశారు. సుమారు 60 కుటుంబాలకు పై బడి ఉన్న ఈ గ్రామంలో ప్రస్తుతం ఒక్క యువకుడు కూడా కనిపించడం లేదు. దీంతో గ్రామంలో నిశ్శబ్ద వాతావరణం చోటు చేసుకుంది. రెక్కాడితే గానీ డొక్కాడని ఈ గ్రామప్రజలు వారి కుటుంబాలకు చెందిన యువకులను ఒక్కొక్కరిని అరెస్టు చేసి తీసుకువెళ్లడంతో భయాందోళనలకు గురవుతున్నారు.

కల్యాణసింగుపూర్‌ ఐఐపీగా శివాజీ పండా

కల్యాణ సింగుపూర్‌లొ వరుస ఘటనల నేపథ్యంలో ఐఐసీగా విధులు నిర్వర్తించే కల్పన బెహరను పోలీస్‌ శాఖ బదిలీ చేసింది. దీంతో ఆ స్థానంలో ఐఐసీగా శివాజీ పండ బాధ్యతలు చేపట్టారు. రాయగడ సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఐఐసీగా విధులు నిర్వహించే పండ ను శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా కల్యాణసింగుపూర్‌ ఐఐసిగా పోలీస్‌ శాఖ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అసలేమైంది..?

కంధమాల్‌ జిల్లా దారింగిబడి జిల్లాలో ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న సుమన్‌ ఝా, అర్పిత సుతారియాలు తమ విధుల్లో భాగంగా ఈ నెల 16 వ తేదీన దారింగిబడి నుండి కలహండి జిల్లా థువామూల్‌ రాంపూర్‌కు వెళ్లేందుకు స్కూటీలో బయల్దేరారు. గూగుల్‌ మ్యాప్‌పై ఆధారపడడంతో థువామూల్‌ రాంపూర్‌కు వెళ్లే ప్రక్రియలో దారితప్పి కల్యాణసింగుపూర్‌ ప్రాంతానికి రాత్రి సమారు 8.30 గంటల ప్రాంతంలొ చేరుకున్నారు. అయితే దారిలొ కొందరు అల్లరిమూక వారిని పిల్లలు ఎత్తుకు వెళ్లేవారిగా చిత్రీకరించి వారిని వెంబడించారు. ఈ క్రమంలో వారి బారి నుంచి బయటపడేందుకు కల్యాణసింగుపూర్‌ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే వారు పిల్లలను ఎత్తుకు వెళ్లే గ్యాంగ్‌ అని వారిని పట్టుకోండని కేకలు వేయడంతో సమీప ప్రాంతాల ప్రజలు వారిపై దాడికి తెగబడ్డారు. యువతి వస్త్రాలను చించే ప్రయత్నం చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఘటన తీవ్రరూపం దాల్చింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement