రాయగడ: జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన కొలనార సమితి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో నలుగురికి రెడ్ క్రాస్ నిధుల నుంచి 28 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే సమితిలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదుల రూపంలొ వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మొత్తం 46 వినతులను అధికారులు స్వీకరించారు. ఇందులో 25 వ్యక్తిగత, 22 సామూహిక గ్రామ సమస్యలుగా గుర్తించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ కెముండో, ఏఎస్పీ గొసానార్ బర్లా, జిల్లా అటవీ శాఖ అధికారి అన్నాసాహెబ్ ఆహోలే, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పెద్దపులి చర్మం స్వాధీనం
కొరాపుట్: విక్రయం జరుగుతున్న పెద్ద పులి చర్మాన్ని నబరంగ్‌పూర్ జిల్లా అటవీ శాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.పెద్ద పులి చర్మం విక్రయం జరుగుతుందనే సమాచారంతో నబరంగ్‌పూర్, డాబుగాం, పపడాహండి, కొడింగాలకు చెందిన అటవీ శాఖ సిబ్బంది పపడాహండి సమితి జఠాబల్ గ్రామ సమీపంలో పత్రి అటవీ ప్రాంతంలో గాలింపులు చేపట్టారు. ఇదే సమయంలో అటవీ సిబ్బంది దాడులు చేయడంతో ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు పరారయ్యారు. పత్రి గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని అదుపు లో తీసుకున్నారు. అతని నుంచి పెద్ద పులి చర్మం స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్మం జార్సుగుడ అడవుల నుంచి తీసుకొని వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. దీని విలువ కనీసం రూ.15 లక్షలు ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఈ ఘటనపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతుందని అటవీ సిబ్బంది ప్రకటించారు.
విలు విద్య కోచ్ రాజేష్ హస్థాక్ మృతి
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లాకు చెందిన విలువిద్య కోచ్ రాజేష్ హస్థాక (49) ఆదివారం మృతి చెందారు. జిల్లాలో సతాలి తెగకు చెందిన ఆదివాసీ యువకుడు ఈ క్రీడలో జిల్లా స్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు వెళ్లాడు. ఈ నెల 18వ తేదీన ఆయన ఆరోగ్య క్షీణించడంతో కుటుంబ సభ్యులు భువనేశ్వర్ తరలించారు. అక్కడ కిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. సోమవారం క్రీడాశాఖ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు.
హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
మల్కన్‌గిరి : హత్య కేసులో దోషిగా తేలిన ఓ వ్యక్తికి మల్కన్‌గిరి జిల్లా సెషన్స్ న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు రూ.10 వేలు జరిమానా విధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 2020లో మల్కన్‌గిరి జిల్లా బలిమెల పోలీసుస్టేషన్ పరిధిలో తర్లాకోట గ్రామానికి చెందిన సుభాష్ భూయాన్ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన బాజా మడ్కామి అనే వ్యక్తి విల్లుతో బాణం సంధించి హత్య చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు బాజా మడ్కామిని అరెస్టు చేశారు. అతడిపై అభియోగ పత్రం దాఖలు చేశారు. 35 మంది సాక్షుల వాంగ్మూలాలు, వాదనలు పరిశీలించిన తర్వాత జిల్లా సెషన్స్ న్యాయమూర్తి రాజలక్ష్మి పట్నాయక్ నిందితుడిని దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు, రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. అదనంగా మృతుడు సుబాష్ భూయాన్ భార్యకు పరిహారంగా రూ.5 లక్షలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.


