కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌

Jun 23 2026 2:04 AM | Updated on Jun 23 2026 2:04 AM

రాయగడ: జిల్లాలొని కల్యాణసింగుపూర్‌ సమితి పర్సాలి పంచాయతీ కార్యాలయం సమీపంలో నియమగిరి ప్రాంతానికి చెందిన డొంగిరియా కొంధొ తెగకు చెందిన ఆదివాసీలు భారీ సమావేశాన్ని నిర్వహించారు. జల్‌–జంగల్‌–జమీన్‌ (నీరు ,అడవి, భూమి) అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న ఆదివాసీ నాయకులపై పోలీసులు తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సమావేశంలో పాల్గొన్న డొంగిరియా యువకులు మాట్లాడుతూ అడవులు, భూములు, ప్రకృతి సంపదల రక్షణ కొసం ఉద్యమిస్తున్న ఆదివాసీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని పోలీసులు వారిపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేస్తున్నారని అన్నారు. ప్రధానంగా నియమగిరి సురక్షా సమితి కన్వినర్‌ లొద్ద సికక పేరుపై వారెంట్‌, నోటీసు జారీ చేయడంతో పాటు ఆయన ఆస్తులను జప్తు చేయమని కళ్యాణసింగుపూర్‌ పోలీసులకు ఆదేశాలు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ చర్యల కారణంగా నియమగిరి ప్రాంత ప్రజల్లో అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు.

నిమయగిరి అడవులే నా అసలైన ఆస్తి

నియమగిరి కొండలు, అడవులు, నీరు, గాలి, వన్యప్రాణులు ,ప్రకృతి సంపద పరిరక్షణే తన అసలైన ఆస్తులని డొంగిరియా కొందొ ఆదిమతెగకు చెందిన నాయకుడు లొద్ద సికక అన్నారు. తన ఇంటిలో కేవలం కొసల మండియా (రాగులు) కందులు, జునుములు, వంటి సంప్రదాయ ధాన్యాలే ఉన్నయని, అవసరమైతే అధికారులు తన ఇంటిని తనిఖీ చేయవచ్చని, అందుకు తను పూర్తి సహకారం ఉంటుందని వివరించారు. నియమగిరి అడవులు, కొండలు, భూములు డొంగిరియా కొంధొల జీవనాధారాలని అన్నారు. అవి వారి సంసృతి, సంప్రదాయాలతో విడదీయరాని బంధమని అన్నారు. ఈ ప్రాంత రక్షణ కోసం దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు ఉద్యమకారులపై వివిధ రకాల ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు.

పోలీసు చర్యలు నిలిపివేయాలని డిమాండ్‌

సమావేశంలో మాట్లాడిన కొందరు ప్రముఖులు నిరపరాధ డొంగిరియా కొంధొలపై అనవసర పోలీసు చర్యలు వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఆదివాసీల రాజ్యంగబద్ధ హక్కులు, అటవీ హక్కుల చట్టాన్ని గౌరవించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ఆదివాసీ నాయకులపై వేధింపులు, కేసులు కొనసాగితే భవిష్యత్‌లొ భారీస్థాయిలో ప్రజా ఉద్యమాలు చేపట్టి రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. సమావేశం ద్వారా నియమగిరి ప్రాంత ప్రజలు తమ హక్కుల పరిరక్షణ కొసం పొరాటాన్ని మరింత ఉద్ధృతం చేసే సంకేతాలు ఇచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement