జయపురం: జయపురం సమితి గొడొపొదర్‌లో సోమవారం బిరిపాణి జాతర వైభవంగా జరిగింది. బిరిపాణి జాతర వ్యవసాయానికి సంబంధించినది. ఈ జాతర ద్వారా వర్షాలు బాగా పడి పంటలు పండాలని వారు కోరుతారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వేలాదిమంది ఆదివాసీ ప్రజా సమూహంతో గ్రామ దేవతల సంబరం జరిగింది. గొడొపొదర్ గ్రామంలో బిరిపాణి జాతర అంగరంగ వైభవంగా దిశారీలు కలిసి జరిపారు. ముందుగా గ్రామ నడి బొడ్డున గల బిరిపాణి దేవి మందిరంలో వివిధ గ్రామ ప్రాంతాల నుంచి వచ్చిన అమ్మవార్ల లాఠీలను మందిరం వద్ద ఉంచి దేవికి కోళ్లు, మేకలు, గొర్రెలు బలి ఇచ్చి జాతర ప్రారంభించారు. ప్రతి ఇంటి వద్ద గ్రామ దేవతల లాఠీలకు పూజలు చేయగా అక్కడి నుంచి గ్రామానికి దూరంలోగల పర్వతంపైకి వెళ్లి పర్వతంపై గల కలుగు వద్ద దేవిని అధిష్టించి పూజలు చేసి.. కలుగులో చేయి పెట్టి ఆ కలుగులో ఉన్న నీటి మట్టాన్ని బట్టి వర్షపాతాన్ని అంచనా వేశారు. జాతరలో పాల్గొన్న భక్తులకు బిలం నుంచి వచ్చే నీటిని ఇస్తారు. ఆ నీటిని పొలాల్లో చల్లుతారు. బిరిపాణి దేవి సత్యమైన తల్లి అని జయపురం మహారాజుల కాలం నుంచి తమ గ్రామ ప్రజలు ఈ పండగ జరుపుతున్నారని గ్రామ పంచాయితీ సర్పంచ్, పూజారి వెల్లడించారు.


