రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్‌లొ దొంగ తనం అనుమానంతో ఓ యువతిపై జరిగిన దారు ణదాడిని రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన అత్యంతదారుణమైనదని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చట్టాన్ని ఎవ్వరూ తమ చేతుల్లోకి తీసుకునే హక్కు లేదన్నారు. ఘటనకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాధ్యులైన వారిపై నిష్పాక్షికంగా, కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై జిల్లా ఎస్పీతో ఇప్పటికే మాట్లాడినట్లు తెలిపారు. ఘటన జరిగిన రోజే ఎస్పీ స్వయంగా అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని వివరించారు. ఇదిలాఉండగా తాను ఆదివాసీ ప్రజాప్రతినిధి అయినప్పటికీ చట్టం అందరికీ సమానమనే నమ్మకం తనకు ఉందని స్పష్టం చేశారు. నిర్ధోషులను వేధించకుండా, అసలు నిందితులను గుర్తించి త్వరితగతిన శిక్షించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా విస్కృత కార్యక్రమాలను ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.


