● 13 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
పలాస:
మండలంలోని పెదంచల గ్రామానికి చెందిన నాతిమిరి రఘునాథన్‌ను బైకుల చోరీ కేసులో అరెస్టు చేసినట్టు జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. కాశీబుగ్గ పోలీసుస్టేషన్ ఆవరణలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. రఘునాథన్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత చదువు మానేసి వెల్డింగ్ పనులు నేర్చుకున్నాడు. అనంతరం బెంగాల్, అబుదాబిలో పనిచేసి 2019లో విశాఖపట్నం చేరుకున్నాడు. పరవాడ ప్రాంతంలోని ఒక ఫార్మా కంపెనీలో వెల్డింగ్ పనులను 2021 వరకు చేశాడు. ఈ సమయంలో ఇతను చెడు అలవాట్లుకు బానిసయ్యాడు. ఆర్థిక పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోవడంతో బైకుల దొంగతనాలకు పాల్పడ్డాడు. కొన్ని బైకులు అతని సొంతానికి వాడుకున్నాడు. ఈ క్రమంలోనే పలాసలోని ఒక ఇంటి ముందు ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను గత నెల 30వ తేదీన దొంగలించాడు. సోమవారం మరో బండిని దొంగతనం చేయడానికి వస్తుండగా కాశీబుగ్గ పోలీసులు పలాస మండలం కంబిరిగాం కూడలి వద్ద రెక్కీ నిర్వహిస్తుండగా చిక్కాడు.
మొత్తం 18 కేసులు
పట్టుబడిన రఘునాథన్‌ను విచారించగా అతనిపై మొత్తం 18 కేసులు ఉన్నట్లు స్పష్టమయ్యాయి. బైకుల దొంగతనం కేసుల్లో ఆమదాలవలస, అనకాపల్లి, విజయనగరం, పరవాడ తదితర పోలీసుస్టేషన్లలో కేసులు ఉన్నాయి. 2024 సెప్టెంబర్ 29న పర్లాకిమిడిలో అరైస్టె.. విశాఖపట్నం సెంట్రల్ జైలుకు వెళ్లి తిరిగి ఈ ఏడాది జనవరి 8న బయటకు వచ్చాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత మరలా దొంగతనాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో పలాసలో బైకు దొంగతనం చేయడానికి వస్తూ పట్టుబడ్డాడు. అతడి వద్ద నుంచి 13 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
సమావేశంలో కాశీబుగ్గ డీఎస్పీ టి.భవానీ, సీఐ వై.రామకృష్ణ, ఎస్‌ఐలు ఆర్.నర్సింహమూర్తి, ఎన్.సునీల్, సీసీసీ ఎస్‌ఐ భరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


