విస్తరణకు అంగీకారం | - | Sakshi
Sakshi News home page

విస్తరణకు అంగీకారం

Jun 22 2026 12:06 AM | Updated on Jun 22 2026 12:06 AM

కొడింగమాలి బాకై ్సట్‌ గని

స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి

రాయగడ: జిల్లాలోని కాసీపూర్‌ సమితి కొడింగమాలి బాకై ్సట్‌ గనుల విస్తరణకు ఆ ప్రాంత వాసులు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. అయితే తమ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని, గని యజమాన్యాన్ని కోరారు. ప్రస్తుతం 3.6 మిలియన్‌ టన్నులగా ఉన్న బాకై ్సట్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని 6.0 మిలియన్‌ టన్నులకు పెంచే ప్రతిపాదనపై ఆదివారం స్థానిక అశోక్‌ కళ్యాణ మండపలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం ప్రశాంతంగా ముగిసింది. కాసీపూర్‌ సమితి పరిధిలోని పొడాపడి, బంకంబా గ్రామ పంచాయతీలకు చెందిన ఏడు గ్రామాల ప్రజలు సమావేశంలో పాల్గొన్నారు. గని విస్తరణకు అనుకూలంగా 26 మంది గ్రామస్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా, మరో 23 మంది లిఖితపూర్వకంగా మద్దతు తెలియజేశారు. అలాగే కంసారిగుడ, పొడాపడి, కిందిరిపదర్‌, పుల్‌జబ, ఉపర్‌ కొడింగ, బంకంబా, బజర్‌గడ్‌ గ్రామాలకు చెందిన 500 మందికిపైగా ప్రజలు హాజరై గని విస్తరణకు సమ్మతించారు. అయితే గని విస్తరణతో పాటు తమ ప్రాంతంలో తాగునీరు, రహదారులు, పాఠశాలలు, వృధ్యాప్త భత్యాలు, వైద్య సదుపాయాలు మెరుగు పరచాలని గ్రామస్తులు కోరారు. స్థానిక యువతకు ఉద్యోగఅవకాశాలు కల్పించడంతో పాటు పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఒడిశా మైనింగ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొడింగమాలి బాకై ్సట్‌ గని కొరాపుట్‌ జిల్లాలోని లక్ష్మీపూర్‌, రాయగడ జిల్లాలొని కాసీపూర్‌ తహసీల్స్‌ పరిధుల్లోని 428.075 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. ఈ గనిలో వార్షిక ఉత్పత్తిని 3.6 మిలియన్‌ టన్నుల నుంచి 6.0 మిలియన్‌ టన్నులకు పెంచే ప్రతిపాదనపై ప్రజా విచారణ నిర్వహించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రాయగడ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) నిహారి రంజన్‌ కుహరో అధ్యక్షత వహించగా, ప్రాంతీయ కాలుష్య నియంత్రణ శాఖ అధికారి అశోక్‌భొయ్‌ సమన్వయం చేశారు. గుణుపూర్‌ సబ్‌ కలెక్టర్‌ దిలీప్‌ దూదూల్‌ అభిషేక్‌, రాయగడ సబ్‌ కలెక్టర్‌ రమేష్‌ చంద్ర జెన్న తదితర అధికారులు హాజరయ్యారు. శాంతి భద్రతల దృష్ట్యా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement