జయపురం: జయపురం పట్టణ పోలీసులు పట్టణంలో తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు జయపురం సబ్‌డివిజనల్ పోలీసు అధికారి(ఎస్.డి.పి.ఓ)అర్చిత మిత్తల్ ఆదివారం పత్రికాల వారికి వెల్లడించారు. జయపురం పట్టణంలో దేవాలయాలలోను, వ్యాపార సంస్థలు విద్యాలయాలు మొదలగు ప్రాంతాలలో ఇటీవల జరిగిన దొంగతనాలకు సంబంధించి నిందితులను అరెస్టు చేసినట్లు ఆమె వెల్లడించారు. అరెస్టయిన నిందితులు స్థానిక ఒడియ మేదరి వీది రింకు బాగ్(20)గోపబందునగర్ నివాసి రవీంధ్ర బాగ్(32) లు వెల్లడించారు. స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయ హాస్టల్‌లో, ఇనుప మంచాలు, చెక్క కుర్చీలు, ప్లాస్టిక్ కుర్చీలతో పాటు ఒక ఆటోను సీజ్ చేసినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. స్థానిక విక్రమ దేవ్ విశ్వవిద్యాలయ హాస్టల్ నుంచి దొంగతనం చేసిన కేసులో ఒక నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా బంకేశ్వర మహాదేవ్ మందిరం, గోపీనాధ్ మందిరాల్లో హుండీలను పగులగొట్టి డబ్బు, రెండు వెండి కిరీటాలను దొంగిలించిన కేసులో ఒక నిందితుడిని అరెస్టు చేశారు. అతడి వద్ద నగదు, దొంగిలించిన సామానులు స్వాధీన పరచుకున్నట్లు పోలీసు అథాకారి వెల్లడించారు. స్థానిక మహాత్మాగాంధీ జంక్షన్‌లో ఒక స్పేర్ పార్ట్స్ దుకాణంలో దొంగతనం చేసిన ఇద్దరు మైనర్ బాలురును అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వారి నుంచి వారు దొంగిలించిన నగదు, ఒక కేష్ టోకెన్‌ను స్వాధీన పరచుకున్నట్లు తెలిపారు. అలాగనే జయపురం కెనాల్ రోడ్డులో ఒక దుకాణం నుంచి దొంగిలించిన రూ.6 లక్షల85 వేలలో ఇద్దరు నిందితుల వద్ద నుంచి రూ.2 లక్షల 75 వేల 500 లు స్వాధీన పరచుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో ఇద్దరు మైనర్ బాలురనివారిని అరెస్టు చేసినట్లు ఎస్‌డీపీఓ వెల్లడించారు.


