● మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి
రాయగడ: ఉపాధి కోసం కేరళకు వెళ్లిన జిల్లాకు చెందిన ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన కుటుంబ సభ్యులను, గ్రామస్తులను విషాదంలోకి ముంచెత్తింది. మృతుడు జిల్లాలోని కాసీపూర్ సమితి దొరాగుడ పోలీస్ స్టేషన్ పరిధిలోని డొంగాసిలి గ్రామానికి చెందిన ధనపతి నాయక్ (28)గా గుర్తించారు. అందిన సమాచారం మేరకు.. ధనపతి నాయక్ సుమారు ఐదు సంవత్సరాల క్రితం కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ నగరంలో ఏంజీ రోడ్డు వద్ద ఉన్న ఓ రెస్టారెంట్లో పనిచేస్తూ జీవననం సాగిస్తున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో ఉపాధి కోసం స్వగ్రామాన్ని విడిచి కేరళకు వెళ్లాడు. ఈ నెల 18వ తేదీన విధులకు సెలవు తీసుకుని స్నేహితులతో కలసి బయటకు వెళ్లిన సమయంలో కొందరు వ్యక్తులతో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో అసోంకు చెందిన కొందరు యువకులతో పాటు ఒడిశాకు చెందిన మరికొందరు యువకులు, యువతులు కలిసి ధనపతిపై దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ధనపతి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. ఈ ఘటనపై త్రిసూర్ పోలీసులు కేసు నమోదు చేసి ఆరుగురుని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అక్కడి ఆస్పత్రిలో భద్రపరిచారు. ఆదివారం పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు. ఈ విషాద సమాచారం డొంగాసిలి గ్రామానికి చేరడంతో గ్రామమంతా శోకసంద్రంగా మారింది. ధనపతి కుటుంబం తీవ్రఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో కేరళ నుంచి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడం తమవల్ల కాదని ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు జిల్లా పరిపాలన, కార్మిక శాఖ అధికారులు సహకరించాలని కుటుంబ సభ్యులు, గ్రామవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలాఉండగా ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా కార్మిక శాఖ అధికారులు ధనపతి పనిచేసిన రెస్టారెంట్ యాజమాన్యంతో చర్చలు జరిపారు. ప్రత్యేక ఆంబులెన్స్ ద్వారా మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కార్మిక శాఖ అధికారి రవీంద్రనాధ్ త్రిపాఠి తెలిపారు.


