పర్లాకిమిడి: అనేక ఆర్థిక మోసాలకు పాల్పడి పరారీలో ఉన్న మహిళ ఝిల్లీ సాహును శనివారం పర్లాకిమిడి ఆదర్శ ఠాణా పోలీసులు రాయగడ బ్లాక్‌లో ఆమె కన్నవారి ఇంట్లో అరెస్టు చేశారు. రెండేళ్లుగా ఈమె పర్లాకిమిడి, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలువురిని కలిసి అధిక వడ్డీలు ఇస్తామని లక్షలాది రూపాయలు తీసుకుని పరారైంది. ప్రాథమిక సమాచారం మేరకు 2023–24 సంవత్సరంలో ఆమె 25 మందిని మోసం చేసి 1.38 కోట్ల రూపాయల నగదుతో పాటు 500 గ్రాముల బంగారం, వెండి వస్తువులు కాజేసినట్టు ఆదర్శ పోలీసు ష్టేషన్ అధికారి ప్రశాంత భూపతి తెలియజేశారు. ఆర్ధిక మోసాలకు పాల్పడిన ఝిల్లి సాహు ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో ఇతరుల బంగారం వస్తువులు కుదువపెట్టి డబ్బులు తీసుకున్నట్టు దర్యాప్తులో తేలినట్టు ఐఐసీ ప్రశాంత భూపతి తెలియజేశారు. ఝిల్లి సాహుతో పాటు భర్త ఉదయనాథ్ సాహు అక్కౌంట్లో రూ. 10 లక్షల లావేదేవీలు జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. వారిపై పలు కేసులు పోలీసు స్టేషన్‌లో నమోదు అయ్యాయి.


