రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితిలో ఇటీవల పిల్లలను అపహరించే వారంటూ అనుమానంతో జరిగిన మూకుమ్మడి దాడి ఘటనలో బాధిత యువతిని రక్షించిన ఇంటాలిగుడ గ్రామానికి చెందిన పురుష సికక అనే ఆదివాసీ యువకుడు వెలుగులోకి వచ్చాడు. తన ప్రాణాలను పణంగా పెట్టి యువతిని రక్షించిన ఘటనకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో విడుదలైన వీడియోల్లో స్పష్టమైంది. ఆగ్రహంతో ఉన్న గుంపు యువతిపై దాడి చేస్తున్న సమయంలో సికక నేరుగా జన సమూహంలోకి వెళ్లి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. గుంపు దాడిలో యువతి దుస్తులు చించివేశారు. తన వద్ద ఉన్న తువ్వాలను ఆమైపె కప్పి మానవత్వాన్ని చాటుకున్నాడు. యువతిని రక్షించే క్రమంలో గుంపు తీవ్రంగా గాయపరిచినప్పటికీ అతను వెనుకాడకుండా ఆమెను సురక్షింతంగా బయటకు తీసుకువచ్చాడు. ఈ సమయంలో యువతి కొన్ని వస్తువులు కిందపడిపోవడంతో వాటిని ఏరుకునే ప్రక్రియలో మరో యువకుడు బలరామ్ బాగ్ ఆ యువతిని పోలీసు వాహనంలో కూర్చొబెట్టి తన టీ–షర్టును ఆమెకు అందించిన వీడియోలు సమాజిక మాధ్యమాల్లో కనిపించాయి. తనపై దాడి కారణంగా ఇప్పటికీ శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని పురుష సకిక తెలిపాడు. సంఘటన జరిగిన రోజు ఇద్దరు స్వచ్ఛం
ధ సేవకులను ప్రశ్నిస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు, సమీపంలోని ఒక డాబా వద్ద మద్యం సేవించిన యువకులు వారిపై దాడి చేయడంతో పరిస్థితి అదుపుతప్పిందన్నారు.
పోలీసుల పాత్రపై ప్రశ్నలు
ఈ ఘటన అనంతరం ఇంటాలిగుడ, సాయినగర్ తదితర పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఘటన స్థలానికి కేవలం రెండు కిలో మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ, సమాచారం సకాలంలో పోలీసులకు అందలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సుమారు 500 మందికి పైగా గుంపు అక్కడకి చేరుకున్నప్పటికీ.. కళ్యాణసింగుపూర్ పోలీసుల స్పందన ఆలస్యమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగిన గంట తరువాత ఐఐసీ కల్పనా బెహర సంఘటన స్థలానికి చేరుకున్నారని, అప్పటికీ గుంపులోకి వెళ్లి పరిస్థితిని అదుపు చేయలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రెడ్ ప్లాగ్ కేసుగా గుర్తింపు
ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ రాజ్ ప్రసాద్ ఈ కేసును రెడ్ ప్లాగ్ కేసుగా పరిగణలోకి తీసుకుంటున్నామని శనివారం రాత్రి విలేకర్ల సమావేశంలో తెలిపారు. ఇప్పటికి 20 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కేసును రెడ్ ప్లాగ్‌గా పరిగణించాలని పోలీసులు ప్రతిపాదించగా.. క్రైం బ్రాంచ్ కూడా దర్యప్తులో సహకరిస్తుందన్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన వారిపై ఐటీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. గ్రామస్తులు మాత్రం ఈ ఘటనలో పలువురు వ్యక్తుల ప్రమేయం ఉన్నప్పటికీ.. కేవలం ఇంటాలిగుడ గ్రామాన్నే లక్ష్యంగా చేసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


