రాయగడ: సదరు సమితి కొత్తపేటలో కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వైద్య శిబిరం జరిగింది. స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లు అంధవరపు గౌరి శంకర్, పవన్ సేనాపతి హాజరై 355 మంది రోగులకు వైద్య సేవలు అందించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కొత్తపేట పరిసర ప్రాంతాల్లో గల వివిధ గ్రామాల నుంచి ప్రజలు ఈ శిబిరంలో పాల్గొన్నారు. ఉదయం పది గంటలకు ప్రారంభమైన వైద్య శిబిరం సాయంత్రం వరకు కొనసాగింది. కొత్తపేట కళింగ వైశ్య సంఘం అధ్యక్షుడు కొత్తకొట శ్రీధర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్తగా ఆవిర్భవించిన ఈ సంఘం ద్వారా ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. సంఘం ఉపాధ్యక్షుడు కొరపాన శ్రీనివాస్‌రావు, కార్యదర్శి పెద్దిన నాగేశ్వరరావు, సహకార్యదర్శి మద్ది సురేష్ కుమార్, పెద్దిన మురళి, తదితరులు సహకరించారని శ్రీధర్ తెలియజేశారు.


