రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయం

Jun 22 2026 12:06 AM | Updated on Jun 22 2026 12:06 AM

49,443 మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున జమ

రాయగడ: రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం 23వ విడత నిధుల విడుదల కార్యక్రమం శనివారం స్థానిక బిజుపట్నాయక్‌ ఆడిటోరియంలో నిర్వహించారు. పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్‌ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రైతుల ఖాతాల్లో నిధులను జమచేశారు. ఈ కార్యక్రమాన్ని రాయగడలోని రైతులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. జిల్లా ప్రధాన వ్యవసాయ అధికారి ఎహెసాన్‌ షేక్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ సమితులకు చెందిన రైతులు పాల్గొన్నారు. ప్రధాని ప్రసంగాన్ని ఆసక్తిగా వీక్షించిన రైతులు తమ ఖాతాల్లో నిధులు జమకావడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. పీఎం–కిసాన్‌ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి మూడు విడతలుగా రెండు వేల రుపాయల చొప్పున మొత్తం రూ.6 వేల ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌పర్‌ (డిబిటి) విధానంలో ఈ నిధులు జమ అవుతున్నాయి. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన వ్యవసాయ శాఖ అధికారి ఎహెసాన్‌ షేక్‌ మాట్లాడుతూ రాయగడ జిల్లాలో మొత్తం 49,443 మంది పీఎం–కిసాన్‌ లబ్ధిదారుల ఖాతాల్లో 23వ విడతగా రెండు వేల రుపాయలు చొప్పున జమ జరిగినట్లు తెలియజేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 100 మంది లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement