పేదలపై ఆర్థిక భారం..
నాలుగు సిలిండర్లకే రాయితీ..
శ్రీకాకుళం పాతబస్టాండ్: పేద, మధ్య తరగతి కుటుంబాలు వంట చెరకు కష్టాల నుంచి విముక్తి పొందాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉజ్వల్ గ్యాస్ రాయితీ పథకంలో మార్పులు చేపట్టారు. ఇప్పటి వరకు ఏటా తొమ్మిది సిలిండర్ల రాయితీ ధరపై అందించేవారు. ఆ భారం కేంద్ర ప్రభుత్వం భరించేది. ఇకపై రాయితీ సిలిండర్లను నాలుగు మాత్రమే తీసుకోవాలని, అదనంగా కావాలంటే అదనపు మొత్తం చెల్లించాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పేద, మధ్య తరగతికి చెందిన ఉజ్వల గ్యాస్ వినియోగదారులు ప్రభుత్వం నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
ఇటీవల పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాలు, ఇతర ఆర్థికపరమైన కారణాల వలన రాయితీ సిలిండర్లు తగ్గించినట్టు ప్రభుత్వం పేర్కొంటుంది. ఇప్పటి వరకు ఉజ్వల పథకం వినియోగదారులు మొదట్లో ఏడాదికి 12 సిలిండర్లు వరకు రాయితీ పొందేవారు. తర్వాత ఆ సంఖ్యను తొమ్మిదికి తగ్గించారు. తాజాగా 4 సిలిండర్లకు కుదించడంతో వినియోగదారులపై భారం పడనుంది. ఒక్కో సిలిండర్ రాయితీ రూ.300 చొప్పున ఏటా రూ.3600 అందాల్సిన ప్రయోజనం ఇకపై రూ.1200 మాత్రమే దక్కనుంది.
మరీ నాలుగేనా?
ఉజ్వల పథకం గ్యాస్ కింద ఒక్కో కుటుంబానికి ఏడాదికి సగటున ఎనిమిది, అంతకంటే ఎక్కువ సిలిండర్లు అవసరమవుతాయి. కేంద్రం తాజా నిర్ణయం ప్రకారం ఇందులో నాలుగింటికి మాత్రమే రాయితీ వర్తిస్తుంది. మిగిలిన నాలుగు సిలిండర్లుకు పూర్తి మొత్తం చెల్లించాల్సిందే. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.968.50 ఉంది. ఈ లెక్కన వినియోగదారులపై భారీగా భారం పడనుంది.
కొత్త కనెక్షన్లు నిల్..
ఉజ్వల పథకంలో కొత్త గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయడం లేదు. గతంలో ఈ పథకం కింద పేద, మధ్య తరగతి కుటుంబాల వారు తెలుపు రేషన్ కార్డు ద్వారా దరఖాస్తు చేసుకొంటే వెంటనే మంజూరు చేసేవారు. ప్రస్తుతం ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది.
ప్రభుత్వం ఉజ్వల పథకం గ్యాస్ సిలిండర్లపై రాయితీని కుదించడం అన్యాయం. పేదలందరూ గ్యాస్ వినియోగించునే లక్ష్యంతో గతంలో ప్రభుత్వమే ఈ పథకాన్ని తీసుకొచ్చి.. ఇప్పుడు కోత విధించడం తగదు. ఉన్నత లక్ష్యంతో తీసుకొచ్చిన పథకాన్ని నిర్వీర్యం చేయడం తగదు.
– బి.వి.రమణ,
గ్యాస్ వినియోగదారుడు, శ్రీకాకుళం
ఉజ్వల పథకం వినియోగదారులకు ఏడాదికి 4 సిలిండర్లు వరకు మాత్రమే రాయితీ వర్తించేలా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. అంతకంటే ఎక్కువ సిలిండర్లు వినియోగించే వారు పూర్తి మొత్తం చెల్లించాలి. అటువంటి వాటికి రాయితీ వర్తించదు.
– జి.సూర్యప్రకాశరావు, డీఎస్‌వో


