ఉపాధి వేతనదారులపై తేనెటీగల దాడి | - | Sakshi
Sakshi News home page

ఉపాధి వేతనదారులపై తేనెటీగల దాడి

Jun 21 2026 12:37 AM | Updated on Jun 21 2026 12:37 AM

సంతబొమ్మాళి : నౌపడలో ఒరేమాడు చెరువులో శనివారం ఉపాధి హామీ పథకం పనులు చేస్తుండగా 16 మంది వేతనదారులపై తేనెటీగలు దాడి చేశాయి. బాధితులను నౌపడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించగా స్టాఫ్‌ నర్సులు ధనలక్ష్మి, అమర వైద్యం అందించారు. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

రైలులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

పలాస: పలాస రైల్వే స్టేషన్‌ పరిధిలో గుణుపూర్‌–కటక్‌ ప్యాసింజర్‌ రైలులో గుర్తు తెలియని వ్యక్తి శనివారం ప్రయాణిస్తూ ఆకస్మికంగా మృతిచెందాడు. మృతుడి వయస్సు 45 నుంచి 50 ఏళ్లు ఉంటుందని, ఎరుపు టీ షర్ట్‌, నలుపు ఫ్యాంట్‌ ధరించాడని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

గాలివాన బీభత్సం

హిరమండలం: ఎల్‌.ఎన్‌.పేట, హిరమండలం మండలాల్లో శనివారం గాలివాన బీభత్సం సృష్టించింది. పలు గ్రామాల్లో చెట్లు విరిగిపడ్డాయి. పొలాల్లో భారీగా నీరు చేరింది. ఇప్పటికే ఖరీఫ్‌లో జల్లిన విత్తనాలు నీట మునిగాయి. దబ్బగూడలో పూరిల్లు నేలకొరిగింది.

ఎంటీఎస్‌ టీచర్లను ఇబ్బందిపెట్టొద్దు

శ్రీకాకుళం : డీఎస్సీ–2008, 1998 ఎంటీఎస్‌ టీచర్ల నియామకం జరిగినప్పటి నుంచి రాష్ట్ర విద్యాశాఖ ప్రతి సంవత్సరం వారిని వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌, బదిలీల పేరుతోనూ స్థాన చలనం చేయడం తగదని డీటీఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు పేడాడ కృష్ణారావు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పూజారి హరిప్రసన్న, ఎన్ని వెంకటప్రసాద్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలోనూ జూన్‌ 22లోపు వారి స్థాన చలనం కోసం రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల అభ్యంతరం చేశారు. ప్రతిసారీ సుదూర ప్రాంతాల పాఠశాలలకు పంపించడంతో వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మొదట్లో నియామకం చేసినప్పుడు వారి సొంత మండలంలోనే పోస్టింగ్‌ ఇచ్చారని, ఆ తర్వాత పక్క మండలాలు, డివిజన్‌ కూడా దాటి పంపించడం సరికాదన్నారు. విద్యా శాఖ అవసరాన్ని బట్టి జిల్లాలో ఎక్కడికి వేస్తారో తెలియని పరిస్థితి నెలకొనడంతో ఆందోళన చెందుతున్నారని, వారికి ఇచ్చే జీతం తక్కువ కావడం, మిగిలిన సర్వీస్‌ కూడా తక్కువే ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

హెడ్‌ కానిస్టేబుల్‌ కుటుంబానికి సాయం

శ్రీకాకుళం క్రైమ్‌ : గుండెపోటుతో మరణించిన ఇచ్ఛాపురం హెడ్‌ కానిస్టేబుల్‌ తమ్మినేని ప్రసాద్‌ కుటుంబానికి జిల్లా పోలీస్‌ అసోసియేషన్‌ డెత్‌ రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ. లక్ష ఆర్థిక సాయం అందించారు. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణంనాయుడు ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు శనివారం నగరంలోని సంపత్‌బాలాజీనగర్‌లో నివాసముంటున్న ప్రసాద్‌ కుటుంబాన్ని పరామర్శించారు. సతీమణి లక్ష్మికి ధైర్యం చెబుతూ అసోసియేషన్‌, జిల్లా పోలీస్‌ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ట్రెజరర్‌ కె.భుజంగరావు పాల్గొన్నారు.

ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి

పాతపట్నం: ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా 3వ అదనపు జడ్జి వివేక్‌ ఆనంద్‌ శ్రీనివాస్‌, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి(డీఎల్‌ఎస్‌ఏ) కె.హరిబాబు అన్నారు. శనివారం పాతపట్నం సబ్‌ జైల్‌ను పాతపట్నం కోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.రోషిణితో కలిసి సందర్శించారు. ఖైదీల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. న్యాయవాదిని నియమించుకునేందుకు ఆర్థిక స్థోమత లేని ముద్దాయిలకు ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని చెప్పారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. జూలై 11న లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీపడేలా చూడాలన్నారు. కార్యక్రమంలో సబ్‌జైలర్‌ ఎం.సన్యాసినాయుడు, న్యాయవాదులు, జైల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement