కబళిస్తున్న క్షయ..! | - | Sakshi
Sakshi News home page

కబళిస్తున్న క్షయ..!

Jun 21 2026 12:31 AM | Updated on Jun 21 2026 12:31 AM

రాయగడ: క్షయ వ్యాధి నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం (ఎన్‌ఎల్‌ఈసీ) అమలు చేస్తున్నప్పటికీ.. రాయగడ జిల్లాలో ప్రతిఏటా కొత్త క్షయ రోగులు వెలుగులోకి వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. గత నాలుగేళ్లలో జిల్లాలో మొత్తం 159 మంది క్షయవ్యాధికి గురైనట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. జిల్లాలోని కాసీపూర్‌ సమితిలోనే అత్యఽ దిక కేసులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం 2022– 23లో 68 కేసులు నమోదు కాగా, 2023–24లో 42, 2024–25లో 36, 2025–26లో 49 కేసులు గుర్తించారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఇప్పటికే 4 నుంచి 5 కేసులు నమోదైనట్లు సమాచారం. క్షయవ్యాధిపై సమాజంలో ఇప్పటికీ అపోహాలు, మూఢనమ్మకాలు కొనసాగుతుండడంతో బాధితులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆరోగ్య శాఖ సిబ్బంది పేర్కొంటుంది. ఈ వ్యాధి బ్యాక్టీరియా వలన సంక్రమిస్తుంది. 2007కు ముందు లెప్రా అనే స్వచ్ఛంద సంస్థ కేంద్ర ప్రభుత్వ జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అవగాహన, చికిత్స, పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించేది. అనంతరం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఆరోగ్య శాఖ పరిధిలోకి తీసుకొచ్చింది. గతంలో క్షయవ్యాధి నియంత్రణ కోసం ప్రత్యేక మల్టీపర్పస్‌ వర్కర్లు పనిచేసేవారు. ప్రస్తుతం పురుష, మహిళా ఆరోగ్య కార్యకర్తలే ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితేవారు ఇతర ఆరోగ్య కార్యక్రమాల్లో కూడా నిమగ్నమై ఉండడంతో క్షయ నిర్మూలనకు అవసరమైన సమయాన్ని కేటాయించలేకపోతున్నారని తెలుస్తుంది. అంతేకాకుండా చాలామంది ఆరోగ్య సిబ్బందికి ఈ వ్యాధిపై ప్రత్యేక శిక్షణ లేకపోవడం వల్ల కొత్త రోగుల గుర్తింపు, చికిత్స పర్యవేక్షణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

చికిత్స విధానం

క్షయ వ్యాధి ప్రారంభ దశలో ఉంటే ఆరు నెలలపాటు మల్టీడ్రగ్‌ థెరాఫీ (ఎండీటీ) మందులు తీసుకోవాలి. వ్యాధి తీవ్రత ఎక్కువైతే ఏడాది వరకు చికిత్స కొనసాగించాల్సి ఉంటుంది. మందులను క్రమం తప్పకుండా వాడకపొతే పూర్తిస్థాయిలో కోలుకోవడం కష్టమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాయగడ వంటి గిరిజన, దూర ప్రాంతాల్లో రోగులు ప్రతిరోజూ మందులు తీసుకుంటున్నారా లేదా అన్నది పర్యవేక్షించేందుకు తగిన సిబ్బంది కొరత ఉందని సమాచారం. జిల్లాలోని కాసీపూర్‌తో పాటు రాయగడ పట్టణ ప్రాంతం, జిమిడిపేట, మునిగుడ, బిసంకటక్‌ ప్రాంతాల్లో క్షయవ్యాధి రోగులను గుర్తిస్తున్నారు. అయితే ఆరోగ్య శాఖ క్షయవ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక సర్వేలు, వైద్య శిబిరాలు నిర్వహించి ముందస్తు గుర్తింపు చర్యలను మరింత బలొపేతం చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

రాయగడ జిల్లాలో ప్రతిఏటా

కొత్త కేసులు

నాలుగేళ్లలో 159 కేసులు గుర్తింపు

అత్యధికంగా కాసీపూర్‌లో నమోదు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement