పిల్లల దొంగలనే అనుమానంతో దాడి | - | Sakshi
Sakshi News home page

పిల్లల దొంగలనే అనుమానంతో దాడి

Jun 21 2026 12:31 AM | Updated on Jun 21 2026 12:31 AM

పిల్లల దొంగలనే అనుమానంతో దాడి

మహిళా స్వచ్ఛంద సేవకురాలి దుస్తులు చించివేసి అమానుషం

ఘటనలో 21 మంది నిందితులు అరెస్టు

రాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్‌ ప్రాంతంలో పిల్లల దొంగలంటూ అనుమానించి ఇద్దరు స్వచ్ఛంద సేవకులపై గ్రామస్తులు అమానుషంగా దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఘటనలో దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా మహిళా స్వచ్ఛంద సేవకురాలిపై జరిగిన దౌర్జన్యం, ఆమె దుస్తులు చింపివేయడం వంటి దృశ్యాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ధామునిపంగ పంచాయతీ పరిధి కందులగూడ గ్రామానికి చేరుకున్న ఇద్దరు స్వచ్ఛంద సేవకులను గ్రామస్తులు పిల్లల దొంగలుగా అనుమానించి ప్రశ్నించారు. దీంతో భయాందోళనకు గురైనవారు అక్కడి నుంచి వెళ్లిపోతుండగా గ్రామస్తులు ఇతర గ్రామాలకు సమాచారం అందించారు. ఈ క్రమంలో పుకార్లు వేగంగా వ్యాపించి సాయినగర్‌, ఇంటాలిగుడ తదితర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.

వందలాది మంది దాడి

సాయినగర్‌ సమీపంలోని ఒక దాబా వద్ద వందలాది మంది యువకులు వారిని అడ్డగించి దాడికి పాల్పడ్డారు. ప్రాణభయంతో వారు సమీపంలోని ఒక భవనంలోకి వెళ్లినా గుంపు అక్కడికి చేరుకుని దాడి కొనసాగించింది. పోలీసుల సమక్షంలో స్థానిక యువకుడు బలరామ్‌ బాగ్‌ మహిళ స్వచ్ఛంద సేవకురాలిని రక్షించి పోలీసులకు అప్పగించాడు. పోలీసులు వారిని కల్యాణ సింగుపూర్‌ సీహెచ్‌సీకి తరలించగా.. అగ్రహంతో అక్కడికి చేరుకున్న గుంపు ఆస్పత్రి తలుపులు, సామగ్రిని ధ్వంసం చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ రాజ్‌ ప్రసాద్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 16 మందిని పోలీసులు అరెస్టు చేయగా, శుక్రవారం మరో ఐదుగురుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అరైస్టెనవారి సంఖ్య 21కు చేరుకుంది. అయితే ఈ దాడికి కారణమైన తప్పుడు ప్రచారం, పుకార్లను వ్యాప్తి చేసిన వ్యక్తులను గుర్తించడంలో పోలీసులు ఇంకా విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ ఘటనపై రాష్ట్ర కాంగ్రెస్‌ అధికారి ప్రతినిధి మనీషా తీవ్రంగా స్పందించారు. మహిళల భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఆమె సోషల్‌ మీడియా వేదికగా విమర్శించారు.

ఐఐసీ బదిలీ

ఇటీవల కాలంలో పలు వివాదస్పద ఘటనలతో వార్తల్లో నిలిచిన కల్యాణ సింగుపూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఐఐసీ కల్పన బెహరను బదిలీ చేశారు. ఆమెను కలహండి జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేసినట్లు అధికారిక సమాచారం వెలువడింది. గ్రామస్తుల ఆందోళనలు, మీడియా ప్రతినిధులతో వివాదాలు, తాజాగా స్వచ్ఛంద సేవకులపై దాడి ఘటన నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దక్షిణ–పశ్చిమ రేంజ్‌ డీఐజీ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆమె బదిలీ అమల్లోకి వచ్చింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement