సమన్వయంతోనే సమస్యలు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతోనే సమస్యలు పరిష్కారం

Jun 21 2026 12:31 AM | Updated on Jun 21 2026 12:31 AM

సమన్వయంతోనే సమస్యలు పరిష్కారం

రాయగడ: అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతోనే సమస్యలు పరిష్కారమవుతాయని రాయగడ మున్సిపల్‌ చైర్మన్‌ మహేష్‌ కుమార్‌ పట్నాయక్‌ అన్నారు. స్థానిక బిజూ పట్నాయక్‌ ఆడిటోరియంలో మున్సిపల్‌ యంత్రాంగం ఆధ్వర్యంలో పట్టణ ప్రజా సంబంధాలు – పౌర భాగస్వామ్యం అనే అంశంపై శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మున్సిపాలిటీ పరిధిలోని వివిధ సమస్యలను సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించుకోవడంతో పాటు, సమన్వయంతో వ్యవహరించి అధికారులకు సహకరిస్తే సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం, వారి సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించి పరిష్కార మార్గాలను సూచించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. దీనిలో భాగంగా ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (అర్బన్‌) 2.0, గృహపన్ను, వాణిజ్య లైసెన్సులు, భవన నిర్మాణ ప్రణాళికల అనుమతులు, సహయోగ్‌ పథకం తదితర అంశాలపై ప్రజలకు సమగ్ర సమాచారం అందించారు. కార్యక్రమానికి హాజరైన ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను అధికారుల దృష్టికి తీసుకురాగా, సంబంధిత శాఖల అధికారులు వాటి పరిష్కారానికి అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కోసం ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించారు. అలాగే అర్హులైన లబ్ధిదారులకు రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. వివిధ ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారికి సంఘటన స్థలం వద్దే దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించారు. అందుకు ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వివిధ వార్డులకు చెందిన కౌన్సిలర్లు, కార్యనిర్వాహక అధికారి కులదీప్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement