భువనేశ్వర్: ఒడిస్సీ, సంబల్‌పురి, జానపద, ఒడిస్సీ నృత్య బ్యాలే ప్రదర్శనలతో నృత్యంవద కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఒడిశా డ్యాన్స్ అకాడమీ 38వ వార్షిక నృత్యోత్సవం పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆ సంస్థ విద్యార్థులు ఈ ప్రదర్శనల్లో కళాప్రతిభని చాటుకున్నారు. అకాడమీకి చెందిన సీనియర్ కళాకారులు, గురువులు, సభ్యులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ మృదంగ వాద్యకారులు గురు ధనేశ్వర్ స్వంయి, ప్రముఖ వయోలిన్ విద్వాంసులు సురమణి రమేష్ చంద్ర దాస్, ఒడిశా సంగీత నాటక అకాడమీ ఉపాధ్యక్షులు మన్మథ శతపథి, ఒడిశా డ్యాన్స్ అకాడమీ కార్యదర్శి గురు డాక్టర్ అరుణా మహంతి, సంయుక్త కార్యదర్శి మధుస్మిత మహంతి తదితర ప్రముఖులు హాజరయ్యారు.
నృత్యంవద కార్యక్రమం గురు అరుణా మహంతి దర్శకత్వంలో తొలి నృత్యం ప్రదర్శించారు. తదుపరి అంశంగా ఒడిశా మో ఒడిశా అనే జానపద నృత్యం ఉత్సాహభరితంగా సాగింది. ఒడిశా సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాలు, కళాత్మక నైపుణ్యాన్ని సంగీత ప్రధాన జానపద నృత్యం చాటి చెప్పింది. ఒడిశా గిరిజన ప్రజల మధురమైన పాటలు, శాసీ్త్రయ, జానపద సంగీతం ద్వారా ఒడియా భాష, సాహిత్యం, పండుగలు, దేవాలయాలు, నదులు మరియు ప్రజల ఉల్లాసభరితమైన జీవనశైలి సౌందర్యం వేదికపై ప్రతిబింబించింది.
స్నేహం, ఐక్యత, సంతోషాల ఉల్లాసభరితమైన వేడుకగా సఖి సంగీ జానపద నృత్యం సమైక్యతకు అద్దం పట్టింది. మహువా పాని సంబల్‌పురి నృత్య ప్రదర్శన పశ్చిమ ఒడిశా జానపద వారసత్వం, ప్రకృతి మరియు దైనందిన జీవితానికి మధ్య ఉన్న ఆనందకరమైన అనుబంధాన్ని ప్రతిబింబించింది. భైరవ రాగం, జాతి తాళంలో కూర్చిన నవ దుర్గ నృత్య రూపకం దుర్గా దేవి తొమ్మిది దివ్య రూపాలను ప్రతి రూపం సీ్త్ర శక్తి, రక్షణ, దయ యొక్క ప్రత్యేక కోణాన్ని భావయుక్తమైన అభినయ ప్రదర్శనగా నిలిచింది. పంచరసి సంబల్‌పురి నృత్య ప్రదర్శన సంబల్‌పూర్ ప్రాంతపు స్ఫూర్తి, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించింది. పండుగల యొక్క ఉత్సాహభరితమైన లక్షణాల చిత్రీకరణతో జాతర బారొమాసి ఒడిస్సీ నృత్య బ్యాలే తుది మెరుపుగా ప్రేక్షకుల హృదయాల్ని దోచుకుంది.


