భువనేశ్వర్: విద్యాభ్యాసంతో నైపుణ్యాభివృద్ధి సాధించి సరికొత్త ఆవిష్కరణలతో అందరికీ మార్గదర్శకంగా స్వావలంబనతో ఎదగడం అలవరచుకోవాలని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ప్రబోధించారు. ఈ దిశలో ఉపాధ్యాయులు, బోధకులు, అధ్యాపకులు విద్యార్థుల్ని ప్రోత్సహించాలని కోరారు. స్థానిక సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్–టెక్నాలజీ (సిపెట్), సెంట్రల్ టూల్ రూమ్–ట్రైనింగ్ సెంటర్ (సీటీటీసీ)లను సందర్శించిన సందర్భంగా ఆయన విద్యార్థులలో వ్యవస్థాపకతను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ఈ పర్యటన సందర్భంగా, గవర్నర్ రెండు సంస్థల అధ్యాపకులు, అధికారులు, విద్యార్థులతో సంభాషించి సృజనాత్మకతతో భావి జీవితాన్ని ఆదర్శప్రాయంగా ఆవిష్కరించుకోవాలని కోరారు.
యువతను ఉద్యోగాన్వేషకులుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా తీర్చిదిద్దాలని గవర్నర్ అధికారులను కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలపై సమాచారంతో వివిధ ఉత్పత్తుల కోసం వ్యక్తిగత ప్రాజెక్ట్ ప్రొఫైల్‌లను సిద్ధం చేయాలని సంస్థలకు సూచించారు. తద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ సొంత సంస్థలను స్థాపించుకోవడానికి అందుబాటులో ఉన్న ఆర్థిక, సాంకేతిక సహాయం గురించి తెలుసుకోగలుగుతారన్నారు. ఈ పర్యటన సందర్భంగా గవర్నర్ ఆయా సంస్థల్లో వివిధ ప్రయోగశాలలను సందర్శించి, అధ్యాపకులు, అధికారులతో సంభాషించారు. కొనసాగుతున్న పరిశోధన, పరీక్షా కార్యకలాపాల గురించి ఆరా తీసి సామాజిక అవసరాలను తీర్చే ఉత్పత్తులు, సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో సంస్థ చేస్తున్న కృషిని ప్రశంసించారు.


